శ్రీకాకుళం అర్బన్: పాయకరావుపేటలో బుధవారం జరగనున్న జలహారతి కార్యక్రమానికి సీఎం చంద్రబాబునాయుడు హాజరుకానున్న నేపథ్యంలో జిల్లా నుంచి ప్రత్యేక బస్సులు వేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. శ్రీకాకుళం ఒకటో డిపో నుంచి 20, రెండో డిపో నుంచి 20, టెక్కలి డిపో నుంచి 10, పలాస డిపో నుంచి 15 బస్సులు మొత్తం 65 బస్సులు జిల్లాలో రద్దు చేశామని, ప్రయాణికులు గమనించి వారి ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించారు.
ఉపాధ్యాయుడికి రిమాండ్
శ్రీకాకుళం రూరల్: మండలంలోని ఓ ప్రాథమిక పాఠశాలలో లైంగిక వేధింపులకు పాల్పడిన ఉపాధ్యాయుడిని మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. శ్రీకాకుళం డీఎస్పీ సీహెచ్ వివేకానంద ఆధ్వర్యంలో పాఠశాలలో విచారణ చేపట్టగా.. వాస్తవాలు నిజమని తేలడంతో సదరు ఉపాధ్యాయుడిని అరెస్టు చేశారు.
కొట్లాట కేసులో ఐదుగురిపై కేసు నమోదు
కొత్తూరు: కొత్తూరులో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ వద్ద సోమవారం రాత్రి జరిగిన కొట్లాటకు సంబంధించి ఇరువర్గాలకు చెందిన ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ కె.వెంకటేష్ మంగళవారం తెలిపారు. వండంకి మంజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇద్దరిపై, సొంట్యాన నవీన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ చెప్పారు.
బైక్ ఢీకొని ఒడిశా యువకుడు మృతి
నరసన్నపేట: ఉర్లాం సమీపంలో ఆర్‌అండ్‌బీ రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒడిశాకు చెందిన 19 ఏళ్ల యువకుడు మృత్యువాత పడ్డాడు. మృతుడు ఒడిశా రాష్ట్రం రాయగడ జిల్లా మునిగూడకు చెందిన పప్పు దండసేన(19)గా పోలీసులు గుర్తించారు. రైల్వే శాఖ ఆధ్వర్యంలో ఉర్లాం వద్ద కొంతకాలంగా పనులు నిర్వహిస్తున్నారు. ఈ పనులు చేసేందుకు వచ్చిన దండసేన నిత్యావసర సరుకుల కోసం తన స్నేహితుడితో కలిసి ఉర్లాం వచ్చాడు. తిరిగి తమ నివాసానికి వెళ్తుండగా గొనబుపేటకు చెందిన కుంచి రాంప్రసాద్ బైక్‌పై అతి వేగంగా వచ్చి వెనుక నుంచి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. తీవ్ర గాయాల పాలైన దండ సేనను నరసన్నపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. సిబ్బంది చికిత్స ప్రారంభించగా అప్పటికే మృతి చెందాడు. నరసన్నపేట ఎస్‌ఐ బి.గణేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా వాహనం పడుపుతున్న రాంప్రసాద్‌కు కూడా గాయాలయ్యాయి. వాహనం నడుపుతుండగా కంట్లో పురుగు పడటంతో బండి అదుపు తప్పిందని రాంప్రసాద్ తెలిపారు.
ఆవులను తప్పించబోయి..
– బైక్ బోల్తాపడి మహిళ మృతి
బూర్జ: వైకుంఠపురం పంచాయతీ అల్లెపల్లిగూడ గిరిజన గ్రామానికి చెందిన మండంగి సుజన(55) శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుజన తన అకౌంట్‌లో ఉపాధి హామీ, హౌసింగ్ డబ్బులు చెక్ చేసేందుకు సోమవారం సాయంత్రం చిన్న కుమారుడు మండంగి సామ్యూల్‌తో కలిసి బైక్‌పై ఉప్పినివలస బయలుదేరింది. మార్గమధ్యలో శ్మశాన వాటిక వద్ద ఆవులను తప్పించబోయి బైక్ అదుపు తప్పింది. వెనుక కూర్చున్న సుజన రోడ్డుపై పడిపోవడంతో తీవ్రంగా గాయపడింది. అపస్మారక స్థితికి చేరుకోవడంతో వెంటనే ఆటోలో రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. కుమారుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. పెద్ద కుమారుడు డానియల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై ఎం.ప్రవళ్లిక కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇచ్ఛాపురం: వన్యప్రాణుల పట్ల ప్రతీ ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు అన్నారు. మున్సిపాలిటీ పరిధి రత్తకన్న గ్రామంలోని ఓ ఇంటికి సమీపంలో గల కంచెలో మంగళవారం రక్తపింజరి పాము చిక్కుకుంది. దీన్ని గుర్తించిన స్థానికులు అటవీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో కాశీబుగ్గ అటవీశాఖ రేంజ్ అధికారి అమ్మన్నాయుడు ఆదేశాల మేరకు సోంపేటకు చెందిన స్నేక్‌క్యాచర్ బాలరాజు సహకారంతో పాముని పట్టుకొని జలంత్రకోట సమీపంలో రక్షిత అటవీశాఖ ప్రాంతంలో విడిచిపెట్టారు. ఈ సందర్బంగా ఫారెస్ట్ సిబ్బంది మాట్లాడుతూ.. వర్షాకాలం కావడంతో ఇళ్ల నుంచి బయటికి వచ్చేటప్పుడు, తోటలు, పంటపొలాలకు వెళ్లేటప్పుడు చెప్పులు లేదా బూట్లను ధరించి టార్చ్‌లైట్‌ని వెంట తీసుకొని వెళ్లాలని సూచించారు.


