● ప్రారంభోత్సవ ఫలకాల్లో ఎంపీ, ఎమ్మెల్యే పేర్లు లేవని అభ్యంతరం
రాయగడ: జిల్లాలోని గుణుపూర్ మున్సిపాలిటీలో నిర్వహించిన స్వయం పరిపాలన దినోత్సవ వేడుకల్లో ప్రోటోకాల్ వివాదం నెలకొంది. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ శిలా ఫలకాల్లో స్థానిక కొరాపుట్ లోక్‌సభ ఎంపీ సప్తగిరి శంకర్ ఉలక, గుణుపూర్ ఎమ్మెల్యే సత్యజీత్ గొమాంగోల పేర్లు లేకపోవడంతో వివాదం చెలరేగింది. అంతేకాకుండా వేడుకలకు ముఖ్య అతిథి గుణుపూర్ సబ్ కలెక్టర్ దుదూల్ అభిషేక్ దిలీప్, గౌరవ అతిథి గుణుపూర్ బీడీవో స్వస్థిక్ జమాదార్‌లు హాజరవ్వకపోవడం చర్చనీయాంశంగా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం మున్సిపాలిటీ లేదా సమితి పరిధిలో జరిగే అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు సంబంధిత ఎంపీ, ఎమ్మెల్యేలను ఆహ్వానించడంతో పాటు ప్రారంభోత్సవ ఫలకాల్లో వారి పేర్లు పొందుపరచాల్సి ఉంటుందని ఎమ్మెల్యే సత్యజీత్ గొమాంగో పేర్కొన్నారు. అయితే గుణుపూర్ మున్సిపాలిటీ చైర్మన్ మమత గౌడో, వైస్ చైర్మన్ శివ ప్రసాద్ గౌడో, కార్యనిర్వాహక అధికారి ఈ నిబంధనలను పాటించలేదని ఆరోపించారు. ఈ విషయాన్ని రాయగడ జిల్లా పట్టణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరక్టర్ అక్షయ కుమార్ ఖెముండో, గుణుపూర్ సబ్ కలెక్టర్ దుదూల్ అభి
షేక్ అనిల్ దృష్టికి తీసుకెళ్లినట్లు ఎమ్మెల్యే గొమాంగొ తెలిపారు. మరోవైపు ఎంపీ సప్తగిరి శంకర్ ఉలక మున్సిపాలిటీ అధికారుల తీరును తీవ్రంగా ఖండించారు. నిబంధనలను ఉల్లంఘించిన అధికారులపై స్వాధికార భంగం నోటీసు జారీ చేసే అంశాన్ని పరిశీలిస్తామని హెచ్చరించారు. ఎమ్మెల్యే కూడా ఈ వ్యవహారాన్ని అసెంబ్లీ స్పీకర్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.
మున్సిపల్ చైర్‌పర్సన్‌కు లేఖ..?
ఫిర్యాదుల నేపధ్యంలో సబ్ కలెక్టర్ మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌కు లేఖ రాసి ప్రభుత్వ నిబంధనలు, ప్రోటోకాల్‌ను తప్పనిసరిగా పాటించాలని సూచించినట్లు సమాచారం. అయితే ఆ సూచనల అనంతరం కూడా ఎంపీ, ఎమ్మెల్యే పేర్లు లేకుండానే కొన్ని అభివృద్ధి పనులను ప్రారంభించడం మరింత వివాదానికి కారణమైంది. మరోవైపు సీనియర్ కౌన్సిలర్ దేవీ ఆచార్య మాట్లాడుతూ స్వపరిపాలన దినోత్సవ వేడుకల నిర్వహణకు ముందుగా కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి చర్చించాల్సి ఉందన్నారు. సమావేశం నిర్వహించకుండా మున్సిపాలిటీ అధికారులు ఏకపక్షంగా వ్యవహరించడం వల్లే ఇలాంటి ఇబ్బందికర పరిస్ధతులు తలెత్తుతున్నాయని ఆరోపించారు. ఈ వ్యవహారంపై మున్సిపాలిటీ కార్యనిర్వాహక అధికారి స్పందిస్తూ ఇది నా దురదృష్టం అని పేర్కొన్నారు. వివాదం నేపధ్యంలో స్వపరిపాలన దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా సబ్ కలెక్టర్ దుదూల్, గౌరవ అతిథిగా పేర్కొన్న బీడీవో స్వస్తిక్ జమాదార్ హాజరవ్వలేదు. దీంతో మున్సిపాలిటీ క్యార్యాలయం ప్రాంగణంలో చైర్మన్ మమత గౌడో, వైస్ చైర్మన్ శివ ప్రసాద్ గౌడో, కార్య నిర్వాహక అధికారి సంతోష్ కుమార్ నాయక్, సమితి వైస్ చైర్మన్ సుదర్శన్ సబర్, కౌన్సిలర్లు దేవీ ప్రసాద్ ఆచార్య, భాగిరథి బొసొయి తదితరులు కార్యక్రమాన్ని నిర్వహించారు.


