లోక్‌ భవన్‌కు ఐజీబీసీ సర్టిఫికెట్‌ | - | Sakshi
Sakshi News home page

లోక్‌ భవన్‌కు ఐజీబీసీ సర్టిఫికెట్‌

Sep 2 2026 12:24 AM | Updated on Sep 2 2026 12:24 AM

సర్టిఫికెట్‌ అందుకున్న గవర్నర్‌ కంభంపాటి హరిబాబు

భువనేశ్వర్‌: రాష్ట్ర గవర్నర్‌ డాక్టర్‌ హరిబాబు కంభంపాటి సమయస్ఫూర్తి, సృజనాత్మకత రాష్ట్రానికి కొత్త వన్నె దిద్దుతోంది. ఆయన ఆధ్వర్యంలో ఒడిశా లోక్‌ భవన్‌ సరికొత్త మైలురాయిని ఆవిష్కరించింది. పర్యావరణహిత కార్యకలాపాల్లో జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించింది. పర్యావరణహిత మౌలిక వసతుల దిశగా చేసిన కృషికి ఫలితంగా ఒడిశా లోక్‌ భవన్‌ ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌ (ఐజీబీసీ) ప్లాటినం సర్టిఫికేషన్‌ పొందింది. జాతీయ స్థాయిలో ఈ ప్రతిష్టాత్మక గుర్తింపు సాధించిన తొలి లోక్‌ భవన్‌ ఇదే కావడం విశేషం. లోక్‌ భవన్‌ నూతన అభిషేక్‌ హాల్‌లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఐజీబీసీ జాతీయ చైర్మన్‌ సి.శేఖర్‌ రెడ్డి నుంచి గవర్నర్‌ హరిబాబు సర్టిఫికెట్‌ను స్వీకరించారు. ఐజీబీసీ రేటింగ్‌లో మొత్తం 100 పాయింట్లకు గాను స్థానిక లోక్‌ భవన్‌ 88 పాయింట్లు సాధించి అత్యున్నత కేటగిరీలో నిలిచిందని ప్రకటించారు.

సమష్టి కృషితోనే గుర్తింపు

ఈ సందర్భంగా గవర్నర్‌ హరిబాబు మాట్లాడుతూ.. పర్యావరణహిత చర్యల్లో సమష్టి కృషితోనే జాతీయ స్థాయిలో గుర్తింపు సాధ్యమైందన్నారు. ఐజీబీసీ సూచనల మేరకు పచ్చదనం సంరక్షణ, స్వచ్ఛ ఇంధన ఉత్పాదన, విద్యుత్‌ వాహనాల వినియోగం వంటి చర్యలతో అత్యున్నత రేటింగ్‌ సాధించగలిగామని వివరించారు. ఈ సర్టిఫికెట్‌ను తన తదుపరి ఢిల్లీ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి చూపిస్తానని తెలిపారు. ఈ ప్రేరణతో మరిన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు పర్యావరణహిత విధానాలను అవలంభించి గ్రీన్‌ సర్టిఫికేషన్‌ పొందేందుకు కొత్త ఉత్సాహంతో ముందుకు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధానంగా రాష్ట్రంలోని విశ్వ విద్యాలయాలు పర్యావరణహిత కార్యాచరణతో ముందడుగు వేయడంలో వీసీలు కీలక పాత్రధారులు కావాలని పిలుపునిచ్చారు. 635 కిలో వాట్‌ – పీక్‌ (కేడబ్ల్యూపీ) సామర్థ్యం కలిగిన సౌర విద్యుత్‌ వ్యవస్థతో పునరుత్పాదక విద్యుత్‌ వినియోగంలో లోక్‌ భవన్‌ ముందంజలో ఉందని తెలిపారు. భువనేశ్వర్‌ లోక్‌ భవన్‌ తరహాలోనే పూరీలోని లోక్‌ భవన్‌ను కూడా గ్రీన్‌ క్యాంపస్‌గా మార్చేందుకు చురుకుగా సన్నాహాలు కొనసాగుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్‌ హరిచందన్‌, విద్యుత్‌ శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి విశాల్‌ కుమార్‌ దేవ్‌, అటవీ, పర్యావరణం, వాతావరణ మార్పుల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ భాస్కర్‌ జ్యోతి శర్మ, గవర్నర్‌ కమిషనర్‌ కమ్‌ కార్యదర్శి డాక్టర్‌ రూపా రోషన్‌ సాహూ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement