జిల్లా రెడ్‌క్రాస్‌కు ‘గవర్నర్‌ గోల్డ్‌మెడల్‌’ | - | Sakshi
Sakshi News home page

జిల్లా రెడ్‌క్రాస్‌కు ‘గవర్నర్‌ గోల్డ్‌మెడల్‌’

Sep 2 2026 12:24 AM | Updated on Sep 2 2026 12:24 AM

శ్రీకాకుళం కల్చరల్‌ : ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో చేపట్టిన మానవతా సేవా కార్యక్రమాల్లో భాగంగా శ్రీకాకుళం జిల్లా అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి అవార్డును కై వసం చేసుకుంది. 2024–25 సంవత్సరానికి గానూ సేవల్లో ఉత్తమ ఫలితాలు సాధించినందుకు జిల్లాకు అరుదైన గౌరవం దక్కింది. విజయవాడలో నిర్వహించిన రెడ్‌క్రాస్‌ రాష్ట్ర శాఖ వార్షిక సాధారణ సమావేశంలో రాష్ట్ర గవర్నర్‌, ఐఆర్‌సీఎస్‌ ప్రెసిడెంట్‌ అబ్దుల్‌ నజీర్‌ చేతుల మీదుగా జిల్లా కలెక్టర్‌, రెడ్‌క్రాస్‌ జిల్లా అధ్యక్షుడు స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ మంగళవారం ‘గవర్నర్‌ గోల్డ్‌మెడల్‌’ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో రక్తదాన శిబిరాలు, తలసేమియా బాధిత చిన్నారులకు ఉచితంగా రక్తాన్ని అందించడం, విపత్తు నిర్వహణ శిక్షణ, ఆరోగ్య అవగాహన సదస్సులు నిరంతరం నిర్వహిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో మారుమూల గ్రామాలకు కూడా రెడ్‌క్రాస్‌ సేవలను విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌ పర్యవేక్షణలో యూత్‌ రెడ్‌క్రాస్‌, పర్యావరణ పరిరక్షణ, మహిళలకు నైపుణ్యాభివృద్ధి, ప్రథమ చికిత్స శిక్షణ కార్యక్రమాలను సమర్థంగా అమలు చేస్తున్నామన్నారు. రెడ్‌క్రాస్‌ ప్రతినిధులు, వలంటీర్లు, రక్తదాతల సమష్టి కృషితోనే ఈ పురస్కారం లభించిందన్నారు. జాయింట్‌ కలెక్టర్‌ తరఫున రెడ్‌క్రాస్‌ జిల్లా చైర్మన్‌ పి.జగన్మోహనరావు అవార్డును స్వీకరించగా ఐఆర్‌సీఎస్‌ మేనేజింగ్‌ కమిటీ సభ్యులు కనుగుల దుర్గ శ్రీనివాస్‌, నిక్కు అప్పన్న, బి.చిన్మయిరావు, పి.వైకుంఠరావు, నూక సన్యాసిరావు, ప్రతినిధులు కె.సత్యనారాయణ, జి.రమణ, పి.చైతన్యకుమార్‌, పి.రాజేష్‌, ఉమా, మాధవకుమార్‌, సిబ్బంది, వలంటీర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement