స్క్రబ్‌ టైఫస్‌ వ్యాప్తి ప్రాంతంపై ప్రత్యేక నిఘా | - | Sakshi
Sakshi News home page

స్క్రబ్‌ టైఫస్‌ వ్యాప్తి ప్రాంతంపై ప్రత్యేక నిఘా

Sep 1 2026 3:00 AM | Updated on Sep 1 2026 3:00 AM

భువనేశ్వర్‌: స్క్రబ్‌ టైఫస్‌ ప్రభావిత ప్రాంతంపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇటీవల రాష్ట్రంలో ఈ వ్యాధి వ్యాప్తి చెందినట్లు ఖరారు కావడంతో స్థానికుల్లో భయాందోళనలు రేకెత్తాయి. ఈ నేపథ్యంలో నిర్వహించిన నమూనా పరీక్షల్లో నెగెటివ్‌ ఖరారు కావడంతో ఆందోళన చెందాల్సిన పరిస్థితులు లేనట్లు ఆరోగ్య శాఖ భరోసా ఇచ్చింది. స్క్రబ్‌ టైఫస్‌ నిర్ధారణకు ఆరోగ్య శాఖ ఎపిడెమియోలాజికల్‌ పరీక్షలను ముమ్మరం చేసింది. ఇంతకు ముందు పరీక్షించిన 9 నమూనాల పరీక్షల్లో సోమవారం ఐజీఎం ఎలీసా ఫలితాలు నెగటివ్‌గా తేలినట్లు పేర్కొన్నారు. మరో వైపు ప్రభావిత ప్రాంతంలో సామూహిక స్క్రీనింగ్‌ నిర్వహించి నమూనాలను సేకరించారు. ఆరోగ్య శాఖ పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోంది. సందిగ్ధ పీడితులు సకాలంలో పరీక్షలు చేయించుకోవడంపై నిరంతర నిఘా వేసింది. ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితిని ఆరోగ్య శాఖ స్క్రబ్‌ టైఫస్‌ అనుమానిత క్లస్టర్‌గా పరిగణిస్తుంది. పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన పర్యావరణం, దట్టమైన వృక్షసంపద, గుబురు పొదలు, గడ్డి ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండాలని ప్రజారోగ్య సంచాలకులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బయటకు వెళ్లేటప్పుడు చెప్పులు తొడుగుకుని, శరీరం పూర్తిగా కప్పి ఉంచే రీతిలో దుస్తులు ధరించి చర్మం బహిర్గతం కాకుండా జాగ్రత్త వహించాలని కోరారు.

బస్సు నుంచి జారిపడి కండక్టర్‌ మృతి

భువనేశ్వర్‌: భద్రక్‌ జిల్లా బేటలిగాంవ్‌ మార్కెట్‌ సమీపంలో కదులుతున్న బస్సు నుంచి జారిపడి కండక్టర్‌ మృతి చెందారు. మృతుడిని ప్రభాత్‌ మల్లిక్‌గా గుర్తించారు. అతను అరడీ అఖండలమణి నుంచి భద్రక్‌ వైపు ప్రయాణిస్తున్న అమానత్‌ బస్సుకు కండక్టర్‌గా పని చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రోడ్డుపై జారిపడి అక్కడికక్కడే మృతి చెందారు.

గంజాయితో ఇద్దరు అరెస్టు

ఆమదాలవలస: స్థానిక పోలీసుస్టేషన్‌ పరిధి కొత్తరోడ్డు సమీపంలోని నాగావళి నది పరివాహక ప్రాంతంలో 2.5 కిలోల గంజాయితో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసినట్లు సీఐ ఎం.సన్యాసినాయుడు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన మాట్లాడుతూ.. నాగావళి నది బ్రిడ్జి కింద ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో ఎస్‌ఐ సనపల బాలరాజు ఆధ్వర్యంలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అనంతరం వారిని తనిఖీ చేయగా అలికాన నవీన్‌ కుమార్‌, చింతాడ దిలీప్‌ అనే ఇద్దరు వ్యక్తుల వద్ద గంజాయి ఉన్నట్లు గుర్తించామన్నారు. మండల డిప్యూటీ తహసీల్దార్‌, వీఆర్వోల సమక్షంలో తనిఖీలు నిర్వహించగా నవీన్‌ కుమార్‌ వద్ద 1.5 కిలోలు, దిలీప్‌ వద్ద కిలో గంజాయి లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. మొత్తంగా 2.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరిపై కేసు నమోదు చేసి ఆమదాలవలస జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో హాజరుపరిచామన్నారు. నిందితులిద్దరికీ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించడంతో వారిని అంపోలు జిల్లా జైలుకు తరలించినట్లు వెల్లడించారు.

బైక్‌ అదుపుతప్పి వ్యక్తి మృతి

మందస: మండలంలోని కొత్తపల్లి జాతీయ రహదారి బ్రిడ్జి సమీపంలో ఆదివారం రాత్రి బైక్‌ అదుపు తప్పి వ్యక్తి మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. పలాస మండలం బొడ్డపాడు గ్రామానికి చెందిన కొత్తపల్లి కాంతారావు(43) కంచిలి నుంచి పలాసకు ద్విచక్ర వాహనంలో వస్తుండగా బైక్‌ అదుపుతప్పి తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో స్థానికులు తీవ్రగాయాలతో ఉన్న కాంతారావును హరిపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స చేసిన అనంతరం 108 వాహనంలో టెక్కలి ప్రభుత్వ ఆస్పత్రికి రిఫర్‌ చేశారు. అయితే మార్గమధ్యలో అతను మృతి చెందారు. కాంతారావుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కంచిలి మండలంలో ఉన్న ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌లో మాస్టర్‌గా పనిచేస్తున్నారు. మందస పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement