రాయగడ: జేకేపూర్ ఉద్యోగుల రాష్ట్ర బీమా (ఈఎస్‌ఐ) హాస్పిటల్‌లో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 13 ఏళ్ల బాలికకు ఇంజెక్షన్ ఇచ్చే సమయంలో, రక్త నమూనా సేకరణలో సరైన విధానాలు పాటింలేదని కుటుంబ సభ్యులు ఆరోపించడంతో హాస్పిటల్‌లో కొంత సమయం ఉద్రిక్తత నెలకొంది. ఘటనపై విధుల్లో ఉన్న వైద్యుడు, నర్సు నుంచి వివరణ కోరనున్నట్లు ఈఎస్‌ఐ అధికారులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. జేకేపూర్ ఉద్యోగుల సంఘం కోశాధికారి హేమంత్ కుమార్ జెన్నా కుమార్తె విజయలక్ష్మి అనారొగ్యంతో భువనేశ్వర్ నుంచి చికిత్స అనంతరం తిరిగి వచ్చింది. వైద్యుల సూచన మేరకు ప్రతీ 21 రోజులకు ఒకసారి ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉండగా.. ఇప్పటికే రెండు ఇంజక్షన్‌లు ఇచ్చారు. మూడో ఇంజక్షన్ కోసం శుక్రవారం ఆమెను జేకేపూర్ ఈఎస్‌ఐ హాస్పిటల్‌కు తీసుకువెళ్లారు. ఇంజక్షన్ ఇవ్వడానికి ముందు అవసరమైన పరీక్షల కోసం రక్త నమూనా సేకరిస్తుండగా విధుల్లో ఉన్న నర్సు పలుమార్లు ప్రయత్నించినప్పటికీ సక్రమంగా రక్త నమూనా తీసుకోలేకపోయారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. బాలిక తీవ్ర ఇబ్బందికి గురైందన్నారు. అనంతరం ఇంజక్షన్ ఇచ్చే సమయంలో కూడా సరైన విధానం పాటించలేదని, ఇంజక్షన్ ప్రక్రియ మధ్యలోనే నిలిచిపోయిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విషయాన్ని వైద్యుడి దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని ఆరోపించారు. దీం
తో సీడీయూ జిల్లా అధ్యక్షురాలు, జేకే పేపర్ మిల్లు, ఇంఫా ఉద్యోగల సంఘం సలహాదరుడు చందనా హరిచందన్.. విధుల్లో ఉన్న వైద్యుడు, నర్సుపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఇలాంటి ఆరోపణలు గతంలోనూ వచ్చాయని, గతంలో ఓ ఉద్యొగికి బ్రెయిన్ హ్యామరేజ్ జరిగిన ఘటన కూడా ఉందన హరిచందన్ పేర్కొన్నారు. హాస్పిటల్‌పై తరచూ ఫిర్యాదులు వస్తున్నప్పటికీ అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. హాస్పిటల్‌లో అంబులెన్స్ సౌకర్యం లేకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో ఉద్యోగులు సొంత ఖర్చులతో ఆంబులెన్స్ ఏర్పాటు చేసకోవాల్సి వస్తోందన్నారు. మరోవైపు ఈఎస్‌ఐ అధికారులు స్పందిస్తూ.. విజయలక్ష్మికి అవసరమైన పరీక్షలు నిర్వహించామని, ఈ క్రమంలో ఇబ్బంది కలిగిన విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. ఘటనపై విధుల్లో ఉన్న వైద్యుడు, నర్సు నుంచి వివరణ కోరనున్నట్లు అధికారులు తెలిపారు.


