● మంటల్లో ట్రాలర్ దగ్ధం
భువనేశ్వర్: పారాదీప్ చేపల రేవులో శనివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒక చేపల పడవ పూర్తిగా దగ్ధమైంది. సమీపంలో ఉన్న జాలర్లు, స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. దేబీ లక్ష్మి అనే పేరు గల చేపల వేట పడవలో అగ్ని ప్రమాదం సంభవించింది. స్వల్ప వ్యవధిలోనే మంటలు చెలరేగి దట్టమైన పొగ మేఘాలు నింగికి ఎగసిపడి ఆందోళన కలిగించాయి. మంటలు తీవ్రమవుతుండటంతో, సమీపంలో ఉన్న జాలర్లు మండుతున్న ట్రాలర్‌పై నీళ్లు చల్లుతూ మంటలను అదుపు చేసేందుకు విఫల యత్నం చేశారు. తక్షణమే అగ్ని మాపక సిబ్బందిని అప్రమత్తం చేయడంతో కుజంగ్ నుంచి ఒక యూనిట్ అగ్నిమాపక బృందం ఘటనా స్థలానికి చేరింది. సమీపంలో లంగరు వేసి ఉన్న ఇతర నౌకలకు మంటలు వ్యాపించకుండా నివారించేందుకు అగ్నిమాపక సిబ్బంది సత్వర చర్యలు చేపట్టారు. అగ్ని ప్రమాదానికి గల కచ్చితమైన కారణం తెలియాల్సి ఉంది. ఈ ఘటనలో గాయాలు లేదా ప్రాణ నష్టం వంటి అవాంఛనీయ సంఘటనలు జరగనట్లు సమాచారం.


