ఒడిశా పోలీసులకు..
భువనేశ్వర్: రాష్ట్రంలో సాంకేతికత ఆధారిత, పౌర కేంద్రీకృత పోలీసింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసి నేర నియంత్రణ, సైబర్ భద్రత, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, తీరప్రాంత భద్రత, శిక్ష విధింపు రేటును మెరుగుపరచడంపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ తెలిపారు. స్థానిక రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయంలో శని వారం జరిగిన రాష్ట్ర స్థాయి డీజీపీ, ఐజీపీల సమావేశంలో ప్రసంగిస్తూ సమర్థమైన నేర నియంత్రణ, సైబర్ భద్రత, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, తీరప్రాంత భద్రత, శిక్ష విధింపు రేటును మెరుగుపరచడంపై పోలీసు బలగాలు దృష్టి సారించాలని ముఖ్యమంత్రి అన్నారు. పోలీసు సంస్కరణల అమలు, రాష్ట్ర భద్రతా వ్యవస్థను బలోపేతం చేజేందుకు ప్రభుత్వం అవసరమైన అన్ని వనరులు, నిధులు, పరిపాలనాపరమైన మద్దతును అందిస్తుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఒడిశా పోలీసులకు ఆయన 10 సూత్రాల ఆదేశాన్ని జారీ చేశారు.
సున్నితత్వం ప్రధానం
సాధారణ పౌరులపై పోలీసు సిబ్బంది సున్నితంగా వ్యవహరించాలి, పోలీస్ ఠాణాకు వచ్చే ప్రతి వ్యక్తిని బాధితుడిగా పరిగణించి వారితో సానుభూతితో వ్యవహరించాలని ఆయన అన్నారు. ‘పోలీసులను చూసి నేరస్థులే వణికిపోతారు కానీ, అమాయక పౌరులు కాదు‘ అనే సూత్రాన్ని పోలీసులు పాటించాలని ఉద్ఘాటించారు.
మాదకద్రవ్య రహితం
2029 నాటికి రాష్ట్రం మాదకద్రవ్య రహితం కావాలి. నేరస్తుల పట్ల శిక్ష విధింపు రేటు పెంచడం అనివార్యం. ఎన్‌సిఆర్‌బి సమాచారం ప్రకారం రాష్ట్రంలో శిక్ష విధింపు రేటు 40 శాతం కొనసాగుతుంది. దాన్ని కనీసం 75 శాతానికి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి కోరారు. ఒడిశా 575 కిలో మీటర్ల సుదీర్ఘ తీరప్రాంతాన్ని సురక్షితం చేయడానికి సముద్ర మార్గాల ద్వారా చొరబాట్లను నివారణ కోసం ప్రత్యేక పోలీసు అధికారులు, మాజీ రక్షణ సిబ్బందిని నియమించినట్లు ఆయన తెలిపారు. గత రెండేళ్లలో పోలీస్ శాఖలో 17,794 కొత్త పోస్టులను సృష్టించి 5,817 పోస్టులను భర్తీ చేశారని ముఖ్యమంత్రి తెలిపారు. పోలీస్ స్టేషన్ల ఆధునికీకరణ కోసం, అవసరమైన పరికరాలతో పాటు రూ. 50 కోట్ల ప్రత్యేక దర్యాప్తు నిధిని కేటాయించారు. పోలీస్ స్టేషన్ల ఆధునీకరణతో సైబర్ నేరాలు, డార్క్ వెబ్ నుంచి వచ్చే ముప్పులను ఎదుర్కొనేందుకు ఎన్‌ఏటీగ్రిడ్, సీసీటీఎన్‌ఎస్ వంటి వ్యవస్థల ద్వారా నిఘా సామర్థ్యాలను బలోపేతం చేయాలని పోలీసులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో శాంతిభద్రతలను పటిష్టం చేసేందుకు పోలీసు బలగాలు పూర్తి అంకితభావంతో పని చేస్తాయని పోలీస్ డైరెక్టర్ జనరల్ వినయ్‌తోష్ మిశ్రా హామీ ఇచ్చారు. సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రముఖ కార్యదర్శి అనూ గర్గ్, హోం శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి హేమంత్ శర్మ, ఇంటెలిజెన్స్ డైరెక్టర్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆర్. పి. కోచె, డీజీపీ (నక్సల్ వ్యతిరేక కార్యకలాపాలు) సంజీబ్ పండా, రాష్ట్రానికి చెందిన ఇతర డీజీపీలు, ఐజీపీలు హాజరయ్యారు.


