అతని కుటుంబానికి అన్ని విధాలా
అండగా ఉంటా..
రాజ్యసభ మాజీ సభ్యుడు నెక్కంటి భాస్కరరావు
రాయగడ: బీజేపీ నాయకుడు, లారీ యజమానుల సంఘం అధ్యక్షుడు యాళ్ల వెంకటేశ్వరరావు అలియాస్ కొండబాబు అకాల మరణం తనను తీవ్రంగా కలిచివేసిందని రాజ్యసభ మాజీ సభ్యుడు , బిజు స్వాభిమాన్ మంచ్ వ్యవస్థాపకులు నెక్కంటి భాస్కరరావు అన్నారు. నాలుగు దశాబ్దాలుగా తనతో ఎంతో సన్నిహిత అనుబంధం కలిగిన కొండబాబు ఇక లేరనే వార్తను జీర్ణించుకోలేకపొతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. శనివారం నెక్కంటి, అతని అనుచరులు, మద్దతుదారులతో స్థానిక రాణిగుడఫారంలోని కొండబాబు స్వగృహానికి చేరుకున్నారు. ఆయన కుటుంబసభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు తన పూర్తి సహకారం ఉంటుందని అన్నారు. అనంతరం తన స్వగృహంలో విలేకర్లతో నెక్కంటి మాట్లాడుతూ.. కొండబాబుతో తనకు నాలుగు దశాబ్దాలుగా అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయని గుర్తు చేశారు. ఆప్తుడిగా, ఆత్మీయుడిగా తనతో కొనసాగిన ఆయన ఆకస్మికంగా మృతి చెందడం తనకు వ్యక్తిగతంగా తీరని లోటని పేర్కొన్నారు. ఇటీవల బీజేపీలో చేరారని.. అయితే ఏ రాజకీయ పార్టీలో ఉన్నప్పటికీ ఆయన సంతోషంగా, ఆయురారోగ్యాలతో ఉండాలని తాను ఎప్పుడూ కొరుకునే వాడినని నెక్కంటి చెప్పారు. అయితే ఇలా అర్ధాంతరంగా అందరినీ విడిచి వెళ్లిపోవడం అత్యంత బాధాకరమన్నారు. కొండబాబు కుటుంబం ఈ కష్టకాలంలో ఒంటరిగా భావించాల్సిన అవసరం లేదని, కుటుంబానికి ఎప్పుడు ఎలాంటి సహాయం అవసరమైనా తాను ముందుండి అండగా నిలుస్తానని స్పష్టం చేశారు. కుటుంబ సభ్యులను పరామార్శించిన వారిలో నెక్కంటి తనయుడు క్రిష్ణ చైతన్య, పి.వి.పి.రాము, దూడల శ్రీనివాస్, తిరుపతి , ఇప్పిలి సన్యాసిరాజు, సానా జగదీష్, రాయగడ సమితి ఉపాధ్యాక్షులు హరప్రసాద్ హెప్రుక, కౌన్సిలర్ సర్మిష్టపాడి, సంతోష్ దలాయి, గోపి గౌడో ఉన్నారు.


