జయపురం: కొరాపుట్ జిల్లా న్యాయ సేవా ప్రదీకరణ జయపురం వారు ప్యానెల్ న్యాయవాదుల శిక్షణ శిబిరాన్ని శనివారం నిర్వహించారు. స్థానిక జిల్లా జడ్జి కోర్టు ప్రాంగణంలో గల జిల్లా న్యాయ సేవా ప్రదీకరణ వివాద పరిస్కార కేంద్రంలో నిర్వహించిన ప్యానెల్ న్యాయవాదుల శిక్షణ శిబిరాన్ని జిల్లా జడ్జి, జిల్లా న్యాయ సేవా ప్రదీకరణ అధ్యక్షుడు ప్రదీప్ కుమార్ మహంతి ప్రారంభించారు. శిక్షణ శిబిరంలో కొరాపుట్, జయపురం, కొట్‌పాడ్, బొరిగుమ్మ, లక్ష్మీపూర్, సెమిలిగుడ, దసమంతపూర్ నుంచి వచ్చిన ప్యానెల్ న్యాయవాదులు పాల్గొన్నారు. జిల్లా జడ్జి ప్రదీప్ కుమార్ మహంతి.. ప్యానెల్ న్యాయవాదులకు స్వాగతం పలికారు. శిక్షణ శిబిరం లక్ష్యాలను వివరించారు. జిల్లా న్యాయ సేవా ప్రదీకరణ కార్యదర్శి ప్రద్యోమయి సుజాత పాల్గొని ప్యానెల్ న్యాయవాదులకు శిక్షకులను పరిచయం చేశారు. ఈ సందర్భంగా ఆమె న్యాయ సేవా ప్రదీకరణ సంస్థ నియమావలి, ప్యానెల్ న్యాయవాదుల భూమిక, బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమయంలో ఏం చేయాలి, ఏం చేయకూడదు, క్‌లైంట్‌తో సంప్రదింపులు, సలహాలు తదితర అంశాలపై ఉద్భోదించారు. జయపురం సివిల్ కోర్టు రిజిస్ట్రార్ మధుశ్మితా సున న్యాయ సేవలో ప్యానెల్ న్యాయవాదుల పాత్రపై ప్రసంగించారు. మరో శిక్షకుడు, జయపురం సెసన్స్ జడ్జి కోర్టు క్యాడర్ పబ్లిక్ ప్యాసిక్యూటర్ మహేంద్ర కుమార్ నాగ్.. క్రిమినల్ కేసులకు సంబంధించిన ప్రాథమిక జ్ఞానం, అరెస్టు చేసిన వ్యక్తి హక్కులు, బెయిల్,ఽ దరఖాస్తు విచారణ, క్రిమినల్ చట్టం ముసాయిదా, సాక్షుల విచారణ, వాదన, న్యాయ సెక్షన్లను వివరించారు. ఈ శిక్షణా కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవా ప్రదీకరణ జయపురం, తాలూకా న్యాయ సేవా కమిటీ కొట్‌పాడ్, కొరాపుట్, బొరిగుమ్మ, లక్ష్మీపూర్, దసమంతపూర్, సెమిలిగుడలలో ప్యానెల్ న్యాయవాదులు, న్యాయ సలహాదారు న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, స్వచ్ఛంద సేవకులు పాల్గొన్నారు.


