జయపురం: స్థానిక విక్రమదేవ్ విశ్వవిద్యాలయంలో కొత్తగా నియమితులైన పీహెచ్‌డీ విద్యార్థులకు ఓరియెంటేషన్ (ఇంట్రడక్షన్) కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీహెచ్‌డీ విద్యార్థులకు విశ్వవిద్యాలయంలో పరిశోధన వ్యవస్థ, నియమ నిబంధనలు, విద్యా వాతావరణం, పరిశోధనలకు సంబంధించిన వివిధ విధానాలను పరిచయం చేయటమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ హృషికేష్ శనాపతి వివరించారు. పరిశోధన రంగంలో క్రమశిక్షణ, నిబద్ధత, మైళికత, పరిశోధన నీతి, అకడమిక్ ఇంటిగ్రటీ యొక్క ప్రాముఖ్యతపై వివరించారు. ఉన్నత ప్రమాణాల పరిశోధనల ద్వారా సమాజ ఉన్నతికి, దేశాభివృద్ధికి సహకారం అందించాలని విద్యార్థులకు ఉద్బోధించారు. రిజిస్ట్రార్ మహేష్ చంద్ర నాయక్ మాట్లాడుతూ.. పరిశోధన పద్ధతలు, సాహిత్య సమీక్ష, పరిశోధన నీతి, డేటా సేకరణ, పరిశోధన వ్యాసం తయారీ, పరిశోధనలో వివిధ దశలను వివరించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యువేట్ కౌన్సిల్ (సిపిజిసి)డాక్టర్ ప్రశాంత కుమార్ పాత్రో, పరీక్షల నియంత్రణ అధికారి రంజన్ కుమార్ ప్రధాన్, విశ్వవిద్యాలయంలోని రిజిస్టర్డ్ పీహెచ్‌డీ పరిశోధన గైడ్‌లు పాల్గొని నూతన పరిశోధన విద్యార్థులకు మార్గదర్శకాలను వివరించారు. డాక్టర్ విజయ కుమార్ శెట్టి ధన్యవాదాలు తెలిపారు.


