● శ్రీమందిరంలో ప్రత్యేకమైన ఆచారాలు
భువనేశ్వర్: శ్రీమందిరంలో, బలభద్రుని జన్మదినోత్సవాన్ని శుక్రవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రత్న వేదికపై కొలువై ఉన్న శ్రీ జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర, సుదర్శనుడు, భూదేవి, శ్రీదేవి అనే ఆరు విగ్రహాలను బంగారు ఆభరణాలతో అలంకరించారు. పూజా పండా, పతి మహా పాత్రో, ముదిరొస్తొ వర్గం సేవాయత్‌ల సహాయంతో శుద్ధ సువార్ సేవకులు బలభద్రుని జన్మ దిన పూజల కోసం విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. ఝులణొ (ఊంజల) ఉత్సవం ఆచారాల కోసం శ్రీ జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రలకు ప్రతినిధులుగా శ్రీదేవి, భూదేవి, మదన్ మోహన్ శ్రీ జగన్నాథుని పవిత్రమైన ఆజా్‌ాఞ్మల పొందడంతో యాత్రకు వేంచేశారు. అనంతరం బలభద్ర స్వామి జన్మ దినోత్సవ పూజాదుల కోసం హరిడ మాల అని పిలువబడే బంగారు పూలమాల అలంకరణతో సుదర్శనుడు రత్న వేదిక నుండి దిగి వచ్చి పల్లకి అధిరోహించి ఊరేగింపుగా మార్కండేయ పుష్కరిణి తీరానికి చేరాడు. ఈ తీరంలో శుద్ధొ సువార్ సేవకులు తడి (ఒండ్రు) మట్టితో శ్రీ బలభద్రుని విగ్రహాన్ని తయారు చేయడంతో పూజా పండా వర్గీయులు పవిత్ర మంత్ర పఠనంతో ఆ విగ్రహానికి ప్రాణం పోసే ఘట్టం పరిసరాల్ని ఆధ్యాత్మికమయంగా మలిచాయి. ప్రాణం పోసుకున్న బలభద్ర స్వామి మట్టి ప్రతిమకు భోగం సమర్పించడంతో జన్మ దినోత్సవం పూజాదులు ముగిసినట్లు పరిగణించి మట్టి విగ్రహాన్ని కొలనులో నిమజ్జనం చేయడం ఆచారంగా నిర్వహించారు. నిమజ్జనం అనంతరం సుదర్శన స్వామి నాలుగు ఆశ్రమాలను సందర్శించి నగర పరిక్రమగా శ్రీ మందిరానికి చేరడంతో బలభద్ర స్వామి జన్మ దినోత్సవం వేడుకలకు తెర పడింది. రాఖీ వేడుక నిర్వహణకు అవసరమైన రాఖీలను పటొరా బిసోయ్ సేవకులు తయారు చేస్తారు. ఈ సందర్భం కోసం 4 ప్రత్యేకమైన రాఖీలను తయారు చేస్తారు. శ్రీ జగన్నాథుని రాఖీని ప్రకాశవంతమైన ఎరుపు, పసుపు పట్టు పోగులతో, బలభద్రుని రాఖీని గాఢమైన నీలం మరియు ఊదా రంగులు పట్టు పోగులతో తయారు చేస్తారు.
మార్కండేయ పుష్కరిణికి
తరలి వెళ్తున్న సుదర్శనుడు
మార్కండేయ పుష్కరిణి తీరంలో బలభద్ర స్వామి మట్టి ప్రతిమ
శ్రీ మందిరం సింహ ద్వారం ఆవరణలో పతిత పావనునికి రాఖీ ధారణ


