జయపురం: జయపురం సూర్యమహల్ ప్రాంగణంలో కేశవ ప్రభాత్ శాఖ జయపురం శాఖ గురువారం పవిత్ర రక్షా బంధన వేడుకలు ఘనంగా జరిపింది. ముందుగా పతాకాన్ని ఎగురవేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్యఅతిథిగా హేమంత భాయ్ పాల్గొని రక్షాబంధన్ పై ప్రసంగించారు. అందరూ ఒకరికొకరు రాఖీలు కట్టుకుని సోదర భావం, ప్రేమ, ఐక్యత సామాజక సద్భావన సందేశాలను అందించారు.
ఐదుగురు మైనర్లకు విముక్తి
పర్లాకిమిడి: గజపతి జిల్లా నుంచి ఐదుగురు బాలికలను తరలించిన నిందితుడిని ఆర్.ఉదయగిరి, అడవ పోలీసు స్టేషన్ అధికారులు అరెస్టు చేసి బాలికలకు విముక్తి కల్పించారు. బాలికలను తిరిగి అడవ పోలీసు స్టేషన్‌కు తీసుకువచ్చి వారి తల్లిదండ్రులకు అప్పజెప్పారు. మోహనా బ్లాక్ అడవ పోలీసు స్టేషన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో సబ్ డివిజనల్ పోలీసు అధికారి రాకేష్ కుమార్ సాహు, ఇన్‌స్పెక్టర్ సంతోష్ బిశోయి తదితరులు పాల్గొన్నారు. మైనర్ బాలికలను ఉద్యోగం ఇప్పిస్తామని ప్రలోభ పెట్టి తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌కు తీసుకెళ్లడంతో గరడమా సర్పంచు ఈనెల 17 అడవపోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దర్యాప్తు చేసి హైదరాబాద్ వెళ్లి బాలికలను మోసం చేసిన వ్యక్తిని పట్టుకుని అరెస్టు చేసినట్టు విలేకరుల సమావేశంలో ఎస్‌డీపీఓ రాకేష్ సాహు తెలిపారు.
రూ.10 కోట్ల విలువైన
గంజాయి పట్టివేత
మల్కన్‌గిరి : మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి కంగురుకొండ పంచాయతీ సమీప అడవిలో బుధవారం రాత్రి కలిమెల పోలీసులు 1025 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా రవాణా చేసేందుకు సిద్ధంగా ఉంచిన గంజాయిపై పోలీసులకు సమాచారం అందడంతో.. కలిమెల ఐఐసీ ప్రభుదత్తు తన సిబ్బందితో అడవిపై దాడి చేయగా పోలీసుల రాకను గమనించిన మాఫియా గంజాయి బస్తాలు వదిలి పరారైంది. పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకుని కలిమెల స్టేషన్‌కు తరలించారు. తహసీల్దార్ సమక్షంలో తూకం వేయగా 1025 కిలోలు ఉంది. దీని విలువ రూ.10కోట్లు వరుకు ఉంటుంది.
సబ్సిడీ ఎరువుల కోసం ఇబ్బందులు
పర్లాకిమిడి: గజపతి జిల్లా కాశీనగర్ ఎన్‌ఏసీ(నగరపాలక సంస్థ)లో ప్రాథమిక వ్యవసాయ కో–ఆపరేటివ్ సొసైటీలో ఎరువుల బస్తాల కోసం రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. రిజిస్ట్రేషన్ల గడువు చివరి తేదీ ఆగస్టు 31వ తేదీ కాగా.. ఇప్పటివరకు 474 మంది మాత్రమే రిజిస్ట్రేషన్లు చేసుకోగలిగారు. సొసైటీలో ఇంటర్నెట్ సేవలు సరిగ్గా లేకపోవడం వల్ల అనేక మంది రైతులు డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేసుకోలేకపోతున్నారు. దీంతో బీజేపీ కృషక్ మోర్చా జిల్లా అధ్యక్షుడు ప్రశాంత్ కుమార్ పాలో డీఆర్‌సీఎస్ హరిహర శెఠికి ఫోన్‌చేసి రైతుల సమస్యలను తెలియజేశారు. గడువులోగా రైతుల రిజిస్ట్రేషన్లు పూర్తి చేయాలని కోరారు.


