రాయగడ:
జిల్లాలోని సదరు సమితి చందిలి పోలీస్ స్టేషన్ పరిధి పెంట గ్రామ శివాలయంలో చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఆలయం తాళం పగలుగొట్టి శివుడు, పార్వతి లోహ విగ్రహాలతో పాటు పూజా సామగ్రిని అపహరించిన ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. గురువారం నిందితులను కోర్టుకు తరలించారు. వివరాల్లోకి వెళితే.. మంగళవారం రాత్రి ఆలయం పూజారి సీహెచ్ నాగరాజు పూజలు ముగించి ఆలయానికి తాళం వేసి ఇంటికి వెళ్లారు. బుధవారం ఉదయం వచ్చి చూసేసరికి ప్రధాన ద్వారం తాళం పగలుగొట్టి ఉండటం గమనించారు. లోపలికి వెళ్లి చూడగా గర్భగుడిలోని విగ్రహాలు, రెండు గంటలు, రెండు బకెట్లు, రెండు చేతి గంటలు, ఇతర పూజా సామగ్రి కనిపించకపోవడంతో చందిలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చోరీకి సంబంధమున్న నువాపడకు చెందిన మనోజ్ దుర్గ, పవన్ గంత, బీసీ రోడ్డులో నివాసముంటున్న అమలాభట్టకు చెందిన అల్లు హరికృష్ణలను అరెస్టు చేశారు. నిందితుల నుంచి చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌డీపీఓ గౌరహరి సాహు, చందిలి ఐఐసీ ఉత్తమ్ కుమార్ సాహు తెలిపారు.


