రాయగడ: జిల్లాలోని బిసంకటక్ పోలీసులు గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపారు. అక్రమంగా పికప్ వ్యాన్‌లో తరలిస్తున్న 230 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోవడంతో పాటు అందుకు సంబంధించి ఇద్దరిని అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సమారు రూ.12 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. రాయగడ నుంచి చత్తీస్‌గఢ్ ప్రాంతానికి జగదల్‌పూర్ మీదుగా అక్రమంగా గంజాయి రవాణా జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. బిసంకటక్ సమీపంలో ఒక పికప్ వ్యాన్ వస్తుండటం గమనించి దాన్ని ఆపి తనిఖీ చేసారు. అందులో భారీ మొత్తంలో గంజాయి పట్టుబడింది. ఈ కేసుకు సంబంధించి ఉత్తరప్రదేశ్‌కు చెందిన వీరేంద్ర సింగ్, కొరాపుట్ జిల్లా ఉమ్మర్‌కోట్ ప్రాంతానికి చెందిన సమీర్ దాస్‌లను పోలీసులు అరెస్టు చేశారు.


