మల్కన్‌గిరి : మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి బోడిగేట పంచాయతీ టెక్‌గూడ గ్రామానికి చెందిన కృష్ణ ఖతేరి(20) అనే యువకుడు పాముకాటుకు గురై మృతిచెందాడు. బుధవారం తల్లిదండ్రులు, సోదరుడితో కలిసి వరి నాట్లు వేసి తిరిగి ఇంటికి వచ్చి భోజనాలు చేసి నిద్రపోయారు. కొంత సమయం తర్వాత విషసర్పం కృష్ణను కాటు వేసింది. నొప్పి రావడంతో మెలకువ వచ్చి చూడగా పాము కాటు వేసి రంధ్రంలోకి వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు వెంటనే గమనించి కృష్ణను కలిమెల ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ చికిత్స పోందుతూ గురువారం వేకువజామున మృతిచెందాడు.
భువనేశ్వర్ డీసీపీ జగ్మోహన్ మీనా రాజీనామా ఆమోదం
భువనేశ్వర్: 2013 బ్యాచ్ ఐపీఎస్ అధికారి, భువనేశ్వర్ డీసీపీ జగ్మోహన్ మీనా రాజీనామాను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖకు నిరభ్యంతర పత్రాన్ని పంపింది. వ్యక్తిగత కారణాలు చూపుతూ ఆయన అఖిల భారత సర్వీసులకు రాజీనామా సమర్పించారు. తన కుటుంబ సభ్యులు, స్నేహితులతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. సుమారు 3 నెలల క్రితమే తన రాజీనామా సమర్పించినట్లు సమాచారం. ఈ విషయం జూలై నెలలో వెలుగులోకి వచ్చింది. భువనేశ్వర్ డీసీపీగా నియమితులు కాకముందు జగ్మోహన్ మీనా మల్కన్‌గిరి, అంగుల్, గంజాం జిల్లాలకు ఎస్పీగా, కటక్ నగర డీసీపీగా పని చేశారు. ఐపీఎస్‌లో చేరడానికి ముందు ఆయన ఐఐటీ కాన్‌పూర్ నుండి ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌లో ఎం.టెక్ పూర్తి చేశారు.
ఘనంగా రాధాగోపాలుని ఊయల యాత్ర
పర్లాకిమిడి: స్థానిక జగన్నాథమందిరం వద్ద రామస్వామి మందిరంలో రాధాగోపాలునికి ఝులానా యాత్ర ఉత్సవం గురువారం నిర్వహించారు. రాధాగోపాలునికి సువాసన వెదజల్లే పుష్పాలతో అలంకరించి ఊయల సేవ చేపట్టారు. అధిక సంఖ్యలు భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.
నేరడి ప్రాజెక్టుతో కాశీనగర్ గ్రామాలకు ముప్పు
పర్లాకిమిడి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్తూరు మండలం నేరడి వద్ద వంశధార నదిపై రిజర్వాయరు నిర్మాణానికి భూసేకరణ ప్రక్రియ ప్రారంభం కావడంతో కాశీనగర్ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గజపతి జిల్లా కాశీనగర్ బ్లాక్‌లో బూదర, వన్న, గౌరి, కాశీనగర్ ప్రాంతంలో 106 ఎకరాల భూమిని సేకరించే ప్రక్రియ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిమగ్నమవ్వడంతో కాశీనగర్ రైతులు పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహితో గురువారం సమావేశమయ్యారు. జిల్లా పరిషత్ అధ్యక్షుడు గవర తిరుపతిరావు, గజపతి జిల్లా బీజేడీ అధ్యక్షుడు ప్రదీప్ నాయక్ తదితరులు హాజరయ్యారు. నేరడి ప్రాజెక్టు వల్ల ప్రభావితమయ్యే 15 గ్రామాల ప్రజలకు అండగా ఉంటామని ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి భరోసా ఇచ్చారు. కాశీనగర్ ప్రాంత వాసుల హక్కులు కాపాడటానికి అవసరమైతే అందోళనలు చేపడతామని జెడ్పీ అధ్యక్షుడు గవర తిరుపతిరావు చెప్పారు.
శ్రీకాకుళం అర్బన్: బ్యాంక్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ జిల్లా కన్వీనర్ బి.శ్రీనివాసులు డిమాండ్ చేశారు. శ్రీకాకుళంలోని ఉ మెన్స్ కాలేజ్ రోడ్డులో గల యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద సాయంత్రం యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ శ్రీకాకుళం జిల్లా ఆధ్వర్యంలో బ్యాంకు ఉద్యోగులు అధికారులు నిరసన కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ శ్రీకాకుళం జిల్లా కన్వీనర్ బి.శ్రీనివాసు లు మాట్లాడుతూ సెప్టెంబర్ 11వ తేదీ సమ్మె చేస్తామని, సమస్యలు పరిష్కారం కాకపోతే సె ప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో మూడు రోజులు సమ్మె చేస్తామని, అక్టోబర్ 26 నుంచి నిరవధిక సమ్మె చేస్తామని హెచ్చరించారు.


