రాయగడ: నోటి కేన్సర్‌తో బాధ పడుతున్న ఆదివాసీ యువతికి ఏడేళ్లుగా పెరుగుతూ వచ్చిన ట్యూమర్‌కు విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించారు. జిల్లాలోని ప్రధాన ఆస్పత్రి దంత, ముఖ శస్త్రచికిత్స నిపుణుడు డాక్టర్ హీరా చంద్ పట్నాయక్ ఆధ్వర్యంలోని వైద్యుల బృందం కటక్‌లోని శాంతి మెమోరియల్ క్యాన్సర్ సెంటర్‌లో ఈ అరుదైన శస్త్రచికిత్సను నిర్వహించింది. ప్రస్తుతం యువతి ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. రాయగడ సదరు సమితి హలువా గ్రామానికి చెందిన ఆదివాసీ యువతి గౌతమీ జకక సుమారు ఏడేళ్లుగా నోటి కేన్సర్‌తో బాధపడుతున్నట్లు గుర్తించారు. తొలుత రాయగడ జిల్లా ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స తీసుకున్న ఆమె అనంతరం ఇంటికి వెళ్లి సంప్రదాయ వైద్యం తీసుకున్నట్లు సమాచారం. అయితే కాలక్రమేణా నోటిలోని ట్యూమర్ పరిమాణం పెరుగుతూ వచ్చింది. పరిస్ధితి విషమించడంతో కుటుంబ సభ్యులు ఆమెను మళ్లీ రాయగడ జిల్లా ప్రధాన ఆస్పత్రికి తీసుకువచ్చారు. వైద్యులు, బయాప్సి పరీక్షలు నిర్వహించగా నోటి కేన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. జిల్లా ఆస్పత్రిలో ఈ స్థాయి శస్త్రచికిత్సకు అవసరమైన పూర్తి సదుపాయాలు అందుబాటులో లేకపొవడంతో గౌతమిని కటక్‌లోని కేన్సర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందించే వైద్య బృందంలో రాయగడ జిల్లా ప్రధాన ఆస్పత్రి దంత, ముఖ శస్త్రచికిత్స నిపుణుడు డాక్టర్ హీరా చంద్ పట్నాయక్ కూడా భాగస్వామిగా ఉన్నారు. గత ఆదివారం వైద్య బృందం గౌతమికి క్లిష్టమైన నోటి క్యాన్సర్ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించింది. ఆపరేషన్ అనంతరం ఆమెను మూడు రోజుల పాటు ఐసీయులో వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని వైద్యులు తెలిపారు. గౌతమికి సంబంధించిన కేన్సర్ చికిత్స మొత్తాన్ని ఆయుష్మాన్ పథకం కింద నిర్వహించినట్లు వైద్యులు తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్న వైద్యుడు స్వయంగా ఈ క్లిష్టమైన శస్త్రచికిత్సలో పాల్గొనడం, పేద కుటుంబానికి ప్రభుత్వ ఆరోగ్య పథకం ద్వారా చికిత్స అందడం పట్ల రాష్ట్ర ఆరోగ్య శాఖ నుంచి డాక్టర్ హీరా చంద్ పట్నాయక్ కు అభినందించినట్లు సమాచారం.


