రాయగడ: బలంగీర్ జిల్లాలో జరిగిన భారీ చోరీ కేసు దర్యాప్తు రాయగడ జిల్లాకు చేరింది. కేసులొ కీలక ఆధారాల మేరకు బలంగీర్ పోలీసులు రాయగడ జిల్లాలోని కళ్యాణసింగుపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దాడులు నిర్వహించి చోరీకి గురైన బంగారు, వెండి ఆభరణాలను పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. కళ్యాణసింగుపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సింగారి పంచాయతీ ఖరయోడా గ్రామంలో బలంగీర్ పోలీసులు బుధవారం దాడులు నిర్వహించారు. ఇటీవల నమోదైన ఓ భారీ చోరీ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు సరైన ఆధారాలతో ఖరాయోడా గ్రామానికి చేరుకుని ఇద్దరి ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. భారీ మొత్తంలో బంగారం, వెండి ఆభరణాలు పోలీసులకు లభించినట్లు సమాచారం. వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఇద్దరిని తమ వెంట బలంగీర్ జిల్లాకు తీసుకెళ్లినట్లు తెలిసింది. ఈ విషయమై కళ్యాణసింగుపూర్ పోలీస్ స్టేషన్ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు. అయితే ఈ దాడి జరిగిన విషయం వాస్తవమని రాయగడ ఎస్‌డీపీఓ గౌర హరి సాహు ధృవీకరించారు. ఇదిలాఉండగా రాయగడ జిల్లా పోలీసులు ఇటీవల రెండేళ్ల కాలంలో జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగిన చోరీ కేసులను ప్రత్యేకంగా దర్యాప్తు చేసి సుమారు 240 గ్రాముల బంగారం, 581 గ్రాముల వెండి ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 12 మందిని అరెస్టు చేసి కోర్టుకు తరలించారు.


