ఎం.ఎం.డి.ఆర్–2026 బిల్లుపై
నిప్పులు చెరిగిన కాంగ్రెస్
జయపురం: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎం.ఎం.డి.ఆర్–2026 బిల్లుపై కొరాపుట్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నిప్పులు చెరిగింది. ఈ బిల్లు పూర్తిగా ఒడిశా రాష్ట్ర వ్యతిరేక బిల్లు అని ఆరోపించింది. బుధవారం స్థానిక బాబా సాహెబ్ కల్యాణ మండపంలో నిర్వహించిన పార్టీ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి మాట్లాడుతూ.. ఈ బిల్లు ద్వారా కేంద్ర ప్రభుత్వం.. ఒడిశా రాష్ట్ర ఖనిజ సంపదను దోచుకోవటానికి యత్నం చేస్తుంన్నారు. ఈ బిల్లు వలన రాష్ట్రానికి ప్రతి ఏడాది కోట్లాది రూపాయలు నష్టం ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒడిశాలో అపారంగా ఉన్న ఖనిజ సంపదను తీసుకువెళ్లి ఇతర రాష్ట్రాలకు విక్రయించేందుకు బీజేపి ప్రభుత్వం ఎత్తుగడ అని ధ్వజమెత్తారు. దీనికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పోరాటం సాగిస్తోందని ఎమ్మెల్యే హెచ్చరించారు. కొరాపుట్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రూపక్ తురుక్ అధ్యక్షతన జరిగిన పార్టీ కార్యవర్గ సభ్యులను సంభోదిస్తూ కేంద్ర ప్రభుత్వం.. మైనింగ్ బిల్లు వలన ఒడిశా రాష్ట్ర ఆర్థిక ప్రయోజనాలకు తీవ్ర నష్టం కలుగుతుందన్నారు. ఆ బిల్లు ద్వారా కేంద్ర ప్రభుత్వం.. మన రాష్ట్ర హక్కులను హరిస్తుందని, అందువల్ల బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రతి ఏడాది రాష్ట్ర రూ.20 వేల కోట్ల రెవెన్యూ కోల్పోతుందని వెల్లడించారు. నేటివరకు ఒక లక్షా 20 వేల కోట్లు కోల్పోయిందని వెల్లడించారు. ఒడిశాలో ఎక్కడ ఖనిజ సంపద, అడవులు, భూములు ఉన్నాయో అక్కడ నిరుపేద ఆదివాసీలు నివసిస్తున్నారని, వారి జీవితాలను బలి చేసేందుకు ఈ బిల్లు తీసుకువచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొరాపుట్ జిల్లాతోపాటు మొత్తం రాష్ట్రంలో ఖనిజ సంపదను తరలించటాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. ఈ సమావేశంలో శాసన సభ కాంగ్రెస్ పక్షనేత, పొట్టంగి ఎమ్మెల్యే రామచంద్ర కడమ్, పార్టీ కార్యవర్గ సభ్యులు దేవేంద్ర బాహిణీపతి, కృష్ణ కులదీప్, నిహార బిశాయి, జగదీష్ కోశ్ల, మనోజ్ హియాల్, బసంత నాయక్, మనోజ్ ఆచార్యతోపాటు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు జిల్లాలో సమితుల, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, విద్యార్థి, యువ, మహిళా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


