న్యూస్‌రీల్
జిల్లా స్థాయిలో 87 శాతం పరిష్కారం
ముఖ్యమంత్రి ఫిర్యాదుల విచారణ కార్యక్రమం
మంగళవారం శ్రీ 25 శ్రీ ఆగస్టు శ్రీ 2026
95 శాతం..
భువనేశ్వర్: ప్రజా సమస్యలపై ప్రత్యక్షంగా ప్రతిస్పదించి సత్వర పరిష్కారం ప్రదానం చేసే దిశలో ముఖ్యమంత్రి ఫిర్యాదుల విచారణ విభాగం చురుగ్గా పని చేస్తోందని రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి తెలిపారు. సోమవారం జరిగిన 20వ రాష్ట్ర స్థాయి ముఖ్యమంత్రి ఫిర్యాదుల విచారణ కార్యక్రమం పురస్కరించుకుని ఆయన మీడియాతో స్పందించారు. సోమవారం ముఖ్యమంత్రి స్థానిక యూనిట్ 2లో ఉన్న ముఖ్యమంత్రి ఫిర్యాదుల విచారణ శిబిరానికి చేరుకుని ప్రజల సమస్యల పట్ల ప్రత్యక్షంగా స్పందించారు. ముఖ్యమంత్రితో పాటు 10 మంది కేబినెట్ మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శి స్థాయి అధికారులు కూడా హాజరై ప్రజల సమస్యలను విన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం. ప్రజల సమస్యలను సంఘీభావంతో విని వాటిని పరిష్కరించడానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ప్రజల సమస్యలు ఎక్కడ ఉన్నా ప్రభుత్వం తప్పకుండా అక్కడికి చేరుకుంటుంది. వరదలు, తుఫాన్లు, కరువులు వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రభుత్వ యంత్రాంగం ఎల్లప్పుడూ ప్రజలకు అండగా నిలిచి సహాయం అందిస్తుంది. 2024లో కురిసిన అకాల వర్షాలను ప్రకృతి వైపరీత్యంగా ప్రకటించి సముచిత సహాయం అందజేసి సకాలంలో స్పందించిందన్నారు. ప్రస్తుతం తాండవిస్తున్న వరద పరిస్థితుల పట్ల అదే రీతిలో ప్రభుత్వ యంత్రాంగం రాత్రింబవళ్లు అప్రమత్తంగా వ్యవహరిస్తు అనుక్షణం సముచిత ప్రతిస్పందనకు అనుకూలంగా చేయూతనందిస్తుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంతకు ముందు నిర్వహించిన 19 సమావేశాలలో గ్రీవెన్స్ సెల్‌కు అందిన 15,327 ఫిర్యాదులలో 14,519 అంటే 95 శాతం ఫిర్యాదులు విజయవంతంగా పరిష్కరించినట్లు ప్రకటించారు. దీంతో పాటు జిల్లా స్థాయిలో కలెక్టర్, పోలీసు సూపరింటెండెంట్లు ప్రజల సమస్యలను క్రమం తప్పకుండా వింటున్నారు. అదే సమయంలో తహసీల్, మండల స్థాయిలో సమస్యల విచారణ క్రమం తప్పకుండా జరుగుతోంది. ఈ ఏడాది జూలై నెలాఖరు నాటికి జిల్లా స్థాయిలో 2,69,394 ఫిర్యాదులను విచారించగా వాటిలో 87 శాతం పరిష్కరించారు. జిల్లా స్థాయిలో అనేక సమస్యలు పరిష్కారమవుతున్నందున ప్రజలకు ఊరట కలిగిస్తుంది. పరిపాలనా వ్యవస్థలో వచ్చిన ఈ మార్పు ప్రభుత్వంపై సామాన్య ప్రజల నమ్మకాన్ని, విశ్వాసాన్ని బలపరుస్తుందన్నారు. ఎప్పటిలాగే, ముఖ్యమంత్రి సోమవారం ఉదయం అందరికంటే ముందుగా వచ్చి, బయట వేచి ఉన్న దివ్యాంగులు, దీర్ఘకాలిక రోగులను కలిసి వారి సమస్యలను విన్నారు. ఆయన వారి ఫిర్యాదు పత్రాలను స్వీకరించి, అక్కడున్న అధికారులను తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం, గది లోపల తమ వివరాలను నమోదు చేసుకున్న ఫిర్యాదుదారుల ఫిర్యాదులను ఆయన విన్నారు. ఈ రోజు, ముఖ్యమంత్రి సింగిల్ విండో సిస్టమ్ ద్వారా వివిధ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 16 మందికి రూ. 14.50 లక్షల వైద్య సహాయాన్ని మంజూరు చేశారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా 600కు పైగా ఫిర్యాదు పత్రాలు అందాయి. ముఖ్యమంత్రి వెంట ఉప ముఖ్యమంత్రి శ్రీ కనక్ బర్ధన్ సింగ్ డియో, రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి శ్రీ సురేష్ పూజారి, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ముఖేష్ మహాలింగ్, వాణిజ్య, రవాణా శాఖ మంత్రి శ్రీ బిభూతి భూషణ్ జెనా, గృహ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ కృష్ణ చంద్ర మహాపాత్ర, ఆహార సరఫరా, వినియోగదారుల సంక్షేమ శాఖ మంత్రి శ్రీ కృష్ణ చంద్ర పాత్ర, సహకార శాఖ మంత్రి శ్రీ ప్రదీప్ బాల సమంత, మత్స్య, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ గోకులనంద్ మల్లిక్, ఉన్నత విద్యా శాఖ మంత్రి శ్రీ సూర్యవంశీ సూరజ్, అటవీ, పర్యావరణ, కార్మిక, ఉద్యోగుల రాష్ట్ర బీమా శాఖ మంత్రి శ్రీ గణేష్‌రామ్ సింగ్ ఖుంటియా హాజరై ప్రజల సమస్యలను విన్నారు. ముఖ్యమంత్రి అదనపు ప్రధాన కార్యదర్శి శ్రీ శాశ్వత్ మిశ్రా, రెవెన్యూ శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి డాక్టర్ అరవింద్ పాధి, ప్రజా ఫిర్యాదులు, ప్రజా పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ సురేష్ కుమార్ వశిష్ట, ఇతర శాఖలకు చెందిన కార్యదర్శి స్థాయి సీనియర్ అధికారులు హాజరై ఫిర్యాదుల విచారణ ప్రక్రియలో సహకరించారు.


