ఒడిశాలోకి ఏనుగుల ప్రవేశం | - | Sakshi
Sakshi News home page

ఒడిశాలోకి ఏనుగుల ప్రవేశం

Aug 25 2026 2:03 AM | Updated on Aug 25 2026 2:03 AM

● ఆంధ్రా నుంచి చొరబడిన ఏనుగుల గుంపు ● ఆందోళనలో రైతులు

● ఆంధ్రా నుంచి చొరబడిన ఏనుగుల గుంపు ● ఆందోళనలో రైతులు

రాయగడ: పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఆహారం కోసం ఎనిమిది ఏనుగుల గుంపు ఒడిశాలోకి ప్రవేశించాయి. ఇవి రాయగడ జిల్లా సరిహద్దు ప్రాంతంలో సంచరిస్తుండటంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. మూడు రోజులుగా రాయగడ సమితిలోని ఎంపలవలస, కెరడ, ఒనిజా, పుడేసు, బైరాగి హలువ గ్రామాల సమీపంలో సంచరిస్తున్న ఏనుగులు సోమవారం ఉదయం కెరడ సమీపంలోని ఓ ఫామాయిల్‌ తోటలోకి చొరబడ్డాయి. ఆంధ్రప్రదేశ్‌లోని వీరఘట్టం రిజర్వ్‌ ఫారెస్ట్‌ నుంచి ఆహారం కోసం ఏనుగుల గుంపు ఇటువైపు వచ్చినట్లు అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు. నాగావళి నదీ పరివాహక ప్రాంతంలో ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ మధ్య ఏనుగులు సంచరిస్తున్నట్లు గుర్తించారు. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లోని పంటపొలాల్లో ఏనుగులు చొరబడి పంటలకు తీవ్రనష్టం కలిగించినట్లు స్థానికులు తెలిపారు. ఏనుగుల సంచారంతో సరిహద్దు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉంటున్నారు. పరిస్థితిని పర్యవేక్షించేందుకు ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ అటవీ శాఖ సిబ్బంది సంయుక్తంగా గస్తీ నిర్వహిస్తున్నారు. ఏనుగులు గ్రామాల్లోకి రాకుండా ముందస్తు చర్యల్లో భాగంగా కొన్ని సరిహద్దు గ్రామాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. రాయగడ అటవీ రేంజర్‌ అనిల్‌ కుమార్‌ పాణిగ్రహి తెలిపిన వివరాల ప్రకారం.. గుంపులో ఆరు ఆడ, రెండు పిల్ల ఏనుగులు ఉన్నాయి. రాయగడ అటవీ శాఖ ప్రత్యేక బృందం నిరంతరం వీటి కదలికలను పర్యవేక్షిస్తుంది. ఏనుగులతో పాటు ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించేందుకు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పాణిగ్రహి తెలియజేశారు. ఇదిలాఉండగా ఏనుగులను దగ్గరగా చూసేందుకు కొందరు యువకులు ఫామాయిల్‌ తోటల్లోకి ప్రవేశించి సెల్‌ఫోన్లతో వీడియోలు చిత్రీకరించి వాటిని సామాజిక మాధ్యమాలో వైరల్‌ చేస్తున్నారు. ఏనుగుల సమీపానికి వెళ్లడం ప్రమాదకరమని.. ప్రజలు అప్రమత్తంగా ఉండి అటవీ శాఖ సూచనలు పాటించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల కూడా రాయగడ జిల్లాలోకి ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఏనుగుల గుంపులు చొరబడ్డాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement