మిఠాయిలు ఇక ‘ప్రియమే’..? | - | Sakshi
Sakshi News home page

మిఠాయిలు ఇక ‘ప్రియమే’..?

Aug 25 2026 2:03 AM | Updated on Aug 25 2026 2:03 AM

మిఠాయిలు ఇక ‘ప్రియమే’..?

భువనేశ్వర్‌: రాష్ట్రంలో మిఠాయిల ధర గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. జున్ను, చక్కెర ధరలు పెరుగుదల ప్రభావంతో మిఠాయిల తయారీ వ్యయం భారం అవుతుందని ఉత్పాదక, వర్తకుల వర్గం ఆవేదన వ్యక్తం చేస్తుంది. మరో వైపు కల్తీ జున్ను కార్యకలాపాలపై నిఘా కట్టుదిట్టం చేయడంతో మిఠాయిల తయారీలో ప్రధాన ముడి సరుకు నాణ్యమైన జున్ను కొరత తాండవిస్తోంది. చక్కెర, వంట చెరకు, ఇతర నిత్యావసర ముడి పదార్థాల ధరల పెరుగుదల కారణంగా మిఠాయిల తయారీ తలకు మించిన భారంగా పరిణమిస్తుందని మిఠాయిల తయారీదారులు, విక్రయదారులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ జున్ను, పనీర్‌పై కొనసాగుతున్న ఉక్కుపాదం చర్యల నేపథ్యంలో పరిస్థితి మరింత సవాలుగా మారింది. మిఠాయి వ్యాపారుల కథనం ప్రకారం ఈ కఠిన చర్యల వల్ల మార్కెట్‌లో జున్ను సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో వ్యాపారాలకు అవసరమైన నాణ్యమైన ముడి సరుకును సేకరించడం కష్టంగా మారింది. ఈ కొరత మిఠాయి ఉత్పత్తిని నేరుగా ప్రభావితం చేయడంతో పాటు నిర్వహణ ఖర్చులను కూడా పెంచింది.

ఈ వ్యాపారంలో ఉపయోగించే దాదాపు అన్ని ముడి పదార్థాల ధరలు పెరిగాయని మిఠాయి వ్యాపారులు చెబుతున్నారు. మిఠాయిల తయారీలో ఉపయోగించే యాలకులు, కట్టెల ధరలు ఇటీవల సుమారు 40 శాతం పెరిగాయని సమాచారం. ముడిసరుకుల ఖర్చులు నిరంతరం పెరుగుతుండటంతో, ప్రస్తుతం మిఠాయి వ్యాపారం గణనీయమైన నష్టాలతో నడుస్తోందని వ్యాపారులు పేర్కొంటున్నారు.

కటక్‌లోని సాలేపూర్‌ ప్రాంతం, భువనేశ్వర్‌లోని పొహలాతో సహా ప్రధాన స్వీట్ల తయారీ కేంద్రాలన్నింటిలో దీని ప్రభావం కనిపిస్తోంది. ముడి పదార్థాల ధరలు తగ్గకపోయినా లేదా సరఫరా పరిస్థితి మెరుగుపడకున్నా మిఠాయిల ధరల పెరుగుదల దాదాపు అనివార్యంగా కనిపిస్తోందని వ్యాపారులు అంటున్నారు. మిఠాయిల ధరలు పెరిగే పరిస్థితులు వినియోగదారులను, మిఠాయి ప్రియులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. సాధారణ ప్రజానీకం ఇప్పటికే కూరగాయలు, పప్పులు, వంట నూనె, చక్కెర ధరల పెరుగుదలతో సతమతమవుతున్న తరుణంలో మిఠాయిల ధరలు పెరిగే పరిస్థితులతో

దైనందిన ఖర్చుల భారం మరింత అధికం అవుతుందని ఆందోళన చెందుతున్నారు.

రక్షా బంధన్‌ పండుగ సమీపిస్తుండటంతో మిఠాయిలకు డిమాండ్‌ అధికంగా ఉంటుందని అంచనా. పండుగ సమయంలో ధరలు పెరిగితే ఖర్చులను మరింత ప్రభావితం చేస్తుందని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. పెరుగుతున్న ఉత్పత్తి వ్యయం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా మిఠాయిల ధరలు పెరిగే పరిస్థితులు పొంచి ఉన్నాయి. ఈ పరిస్థితుల నివారణ పట్ల అనుబంధ ప్రభుత్వ వర్గాలు సమయోచితంగా స్పందించి ధరల పెరుగుదలని కట్టడి చేయాలని వినియోగదారులతో మిఠాయిల తయారీ, పంపిణీ, వ్యాపార వర్గాలు కోరుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement