● ఆదివాసీలు–పోలీసుల వివాదంపై..హైకోర్టు కీలక ఆదేశం
రాయగడ: జిల్లాలోని కాసీపూర్ సమితిలో రహదారి నిర్మాణం, మైనింగ్ ప్రాజెక్టును కేంద్రంగా చేసుకుని ఆదివాసీ గ్రామస్తులు, పోలీసుల మధ్య నెలకొన్న వివారం, పోలీసులపై వచ్చిన ఆరోపణల విషయంలో రాష్ట్ర హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఘటనాస్థలిలో వాస్తవ పరిస్థితులను స్వయంగా పరిశీలించి నివేదిక సమర్పించాలని రాయగడ జిల్లా ఎస్పీ, అదనపు ఎస్పీతో పాటు సంబంధిత గ్రామాల సర్పంచ్‌లను కోర్టు ఆదేశించింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం మూడు వారాల్లొ ఈ కేసుకు సంబంధించి సమగ్ర అఫిడవిట్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. కార్యనిర్వాహక ప్రధాన న్యాయమూర్తి హరీష్ టండన్, న్యాయమూర్తి చిత్తరంజన్ దాస్‌తో కూడిన ధర్మాసనం పురుషోత్తం హికక తదితరులు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వాజ్యంపై విచారణ సందర్భంగా ఈ ఆదేశాలు ఇచ్చింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది అనూప్ కుమార్ మహాపాత్రో వాదిస్తూ.. 2026 మార్చి పదో తేదీ తెల్లవారుజామున పోలీసులు ఆదివాసీ గ్రామాల్లోకి వెళ్లి ఇళ్లపై దాడులు, ధ్వంసానికి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ సందర్భంగా పది మంది మహిళలు, 19 ఏళ్ల గర్భిణితోపాటు ముగ్గురు చిన్న పిల్లల తల్లుల సహా మొత్తం 21 మందిని అరెస్టు చేసి యూఏపీఏ చట్టం కింద భవానీపట్నం జైలుకు తరలించినట్లు కోర్టుకు తెలిపారు. కాసీపూర్, కర్లాపాట్ పోలీస్ స్టేషన్ల ఐఐసీల ఆధ్వర్యంలో తలుపులు బద్దలు కొట్టి సోదాలు నిర్వహించారని, ఇది సుప్రీంకోర్టు డీకే బసు వర్సెస్ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కేసులో నిర్దేశించిన మార్గదర్శకాలకు విరుద్ధమని పిటిషన్ల తరఫు న్యాయవాది వాదించారు. రహదారి నిర్మాణం, ప్రాజెక్టుకు వ్యతిరేకంగా గ్రామస్తులు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న సమయంలో పోలీసులు ఈ చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. 2023 నుంచి కొనసాగుతున్న పరిణామాలతోపాటు 2026 ఏప్రిల్ ఆరో తేదీ అర్ధరాత్రి జరిగిన దాడిపై హైకోర్టు ప్రస్తుత లేదా రిటైర్డు న్యాయమూర్తితో న్యాయ విచారణ జరిపించాలని, లేదా హైకోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)తో విచారణ జరిపించాలని పిటిషనర్లు కోరారు. బాధితులకు పరిహారం అందించడంతో పాటు బాధ్యులైన పోలీసు అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూడా అభ్యర్ధించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు ప్రభుత్వ న్యాయవాది శాస్వత్ దాస్ వాదిస్తూ.. సమర్ధవంతమైన కోర్టు జారీ చేసిన నాన్–బెయిలెబుల్ వారెంట్లను అమలు చేసేందుకు పోలీసులు గ్రామానికివె వెళ్లారని తెలిపారు. ఆ సమయంలో గ్రామస్తుల నుంచి జరిగిన దాడిలో 58 మంది పోలీసు సిబ్బంది గాయపడ్డారని ప్రభుత్వ తరుఫున కోర్టుకు వివరించింది. ప్రస్తుతం పోలీసులు గ్రామాల్లోకి వెళ్లకుండా సంయమనం పాటిస్తున్నారని, కాంటమాల్, పరిసర ప్రాంతాల్లొ పరిస్ధితి పూర్తిగా ప్రశాంతంగా ఉందని ప్రభుత్వం తెలిపింది. సుంగేర్ పంచాయితీ పరిధిలొని సాగబరి గ్రామంలొ ప్రస్తుతం ఎలాంటి రహదారి నిర్మాణం పనులు జరగడం లేదని కూడా స్పష్టం చేసింది. అదేవిధంగా అటవీ హక్కుల చట్టం ప్రకారం 2023 డిసెంబరు 8 వ తేదీన ప్రభావిత ఎనిమిది గ్రామాల్లో నిర్వహించిన గ్రామసభల్లో మైనింగ్ ప్రాజెక్టుకు ఏకగ్రీవంగా సమ్మతి లభించిందని ప్రభుత్వ వర్గాలు కోర్టుకు తెలిపాయి.
సంయుక్తంగా స్పాట్ తనిఖీ
కేసు తీవ్రతను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు రాయగడ జిల్లా ఎస్పీ, అదనపు ఎస్పీ, కాంటమాల్, సగబరి గ్రామాల సర్పంచులు కలిసి ఘటనాస్థలిని సంయుక్తంగా పరిశీలించి వాస్తవ పరిస్థితులపై నివేదిక సమర్పించాలని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం మూడు వారాల్లో కేసుకు సంబంధించిన సమగ్ర అఫిడవిట్ దాఖలు చేయాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రాంతంలొ ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకొకుండా పోలీసులు చర్యలు తీసుకొవాలని ఆదేశించడంతొ పాటు ,తదుపరి విచారణ వరకు గ్రామస్తులు చట్టాన్ని చేతుల్లొకి తీసుకొకుండా చూడాలని పిటిషనర్లకు కూడా సూచించింది. కేసు తదుపరి విచారణ 2026 సెప్టెంబరు 2 కు హైకొర్టు వాయిదా వేసింది. ఈ ఆదేశాల నేపధ్యంలొ ఘటనాస్ధలిలొని వాస్తవ పరిస్ధితులు, గ్రామస్తుల ఆరోపణలు, ప్రభుత్వం సమర్పించే వివరాలపై తదుపరి విచారణలో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.


