● శ్రావణమాసంలో పెళ్లిళ్ల జోరు ● కళకళలాడుతున్న కల్యాణ మండపాలు ● వచ్చే నెల వరకూ శుభ ముహూర్తాలు
ఆగస్టులో 23, 24, 26, 27, 28, 30, 31
సెప్టెంబర్‌లో 3, 4, 5, 6, 7 తర్వాత భాద్రపద మాసం ప్రారంభం
శ్రీకాకుళం కల్చరల్ :
శుభ ముహూర్తాల శ్రావణమాసంలో పెళ్లిళ్లు జోరందుకున్నాయి. నెలంతా మంచి ముహూర్తాలు ఉండటంతో కల్యాణ మండపాలు కళకళలాడుతు న్నాయి. జిల్లా కేంద్రంతో పాటు టెక్కలి, నరసన్నపేట, పలాస నియోజకవర్గాల్లో వివాహాల సందడి ఎక్కువగా కనిపిస్తోంది.
పెళ్లంటేనే సందడి. జీవితంలో ఒకసారి మాత్రమే జరిగే ఈ వేడుకను చిరకాలం గుర్తుండిపోయేలా కొందరు గ్రాండ్‌గా నిర్వహిస్తున్నారు. అతిథులను ఆకట్టుకునే విధంగా ఎటుచూసినా మిరుమిట్లు గొలి పే విద్యుత్ దీపాలు, షామియానాలు, ఇంద్రలోకంలో ఉన్నామా అనే తీరుగా సరికొత్త డెకరేషన్లతో అదరగొడుతున్నారు. వీటికి తోడు కడుపునిండా తినేందుకు వివిధ రకాల వంటకాలు, ఆహా అనిపించే ఆతిథ్యం అందిస్తున్నారు. జిల్లా కేంద్రంలో ఇటీవల జరిగిన ఓ పెళ్లి వేడుకకు రూ.30లక్షల వరకు ఖర్చు చేసారంటే అతిశయోక్తి కాదు.
సరికొత్త ఒరవడి..
గతంలో పెళ్లంటే బ్యాండ్‌మేళాలు, భాజాభజంత్రీ లు, పూలమండపాలు, వీడియో షూటింగ్‌లు ఉండేవి. ప్రస్తుతం కొత్త ఒరవడి కనిపిస్తోంది. వివాహ ముహుర్తానికి ముందే సంగీత్, ప్రీ వెడ్డింగ్ షూట్లకు ప్రకృతి సోయగాలున్న ప్రాంతాలకు వెళ్లడంతో పాటు సముద్రతీరాలకు వెళ్లి కాబోయే వధువరులతో ప్రత్యేక పాటలు రూపకల్పన చేస్తున్నారు. కొంతమంది కల్యాణ మండపంలోనే సెట్టింగులు వేసి షూటింగ్‌లు నిర్వహిస్తున్నారు. మండపాలలో ఎల్‌ఈడీ స్క్రీన్‌లు వంటివి ప్రదర్శిస్తున్నారు.
వరుసగా ముహూర్తాలు ఉండటంతో కల్యాణ మండపాలకు డిమాండ్ పెరిగింది. నగరంలో మండపాలతో పాటుగా నగరం వెలుపల ఉన్న రిసార్టులు, ఖాళీ ప్రదేశాలలో సెట్టింగులు, పెద్దపెద్ద ఫంక్షన్ హాళ్లు 25కు పైగా ఉన్నాయి. ఫంక్షన్‌హాలు బట్టి అద్దె వసూలు చేస్తున్నారు. మినీ ఫంక్షన్ హాలుకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేస్తుంటే పెద్దవాటికి రూ.3లక్షలకు పైగా అద్దెలు వసూలు చేస్తున్నారు. పూల డెకరేషన్, లైటింగ్, భోజనాల ఖర్చు వంటి వాటితో కలిపి రూ.10లక్షల నుంచి రూ.20లక్షల వరకు ఖర్చు అవుతోందని నిర్వాహకులు చెబుతున్నారు.


