శ్రీకాకుళం కల్చరల్ : కళారంగానికి జీవం పోస్తూ నాటక రంగాన్ని ఆదరించేందుకు నిరంతరం కృషిచే స్తున్న శ్రీసుమిత్రా కళాసమితి పర్యవేక్షణలో సెప్టెంబర్ 17 నుంచి 20వ తేదీ వరకు అఖిలభారత బహుభాషా నాటిక పోటీలు నిర్వహిస్తున్నట్లు కళా సమితి అధ్యక్షుడు ఇప్పిలి శంకరశర్మ తెలిపారు. నగరంలోని అవోపా కల్యాణ మండపంలో శనివారం నాటికపోటీల బ్రోచర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏటా మాదిరిగానే ఈ సంవత్సరం కూడా బహుభాషా నాటిక పోటీలు నిర్వహిస్తున్నామన్నారు.
శ్రీకాకుళం నగరంలోని బాపూజీ కళామందిరంలో నాలుగు రోజుల పాటు ప్రతిరోజూ సాయంత్రం 6 గంటల నుంచి నాటిక ప్రదర్శనలు ఉంటాయని చెప్పారు. కోల్‌కతా, గౌహ తి, ముంబై, బెంగళూరు, రూర్కెలా, రాయ్‌పూర్, గుడివాడ, ప్రయాగ్‌రాజ్ ప్రాంతాల నుంచి కళాకారులు నాటికలను ప్రదర్శిస్తారని పేర్కొన్నారు. రోజుకు రెండు చొప్పున ప్రదర్శనలు జరుగుతాయ ని చెప్పారు. శ్రీసుమిత్రా కళాసమితి పిలుపుమేరకు పలు రాష్ట్రాల నుంచి ఎంట్రీలు వచ్చాయని, వాటిలో ఎంపిక చేసిన నాటికల ప్రదర్శన ఉంటుందని పేర్కొన్నారు.
నాటికలు ఇవే..
17న బెంగాళీ కళాకారుల జ్వాలా, అస్సామీ బృందం జీవశ్రేష్ఠ్ నాటికలు, 18న మరాఠీ నాటిక సూప్, కన్నడ నాటిక సాంగ్యాచీబాల్యా, 19న ఒడియా నాటిక ఫేసెస్ ఆఫ్ ఉమెన్, ఛత్తీస్‌గఢ్ నాటిక యకీనన్, 20న హిందీ– పంజాబీ భాషలో స్వాతంత్య్ర సమరయోధులు భగత్‌సింగ్, తెలుగు నాటిక ద్వారబంధాల చంద్రయ్యనాయుడు ప్రదర్శిస్తారని చెప్పా రు. కళాకారులు, కళాభిమానులు నాలుగు రోజులపాటు జరిగే బహుభాషా నాటికపోటీలను తిలకించి కళాకారులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చా రు. సమావేశంలో సుమిత్రా కళాసమితి సభ్యులు కొంక్యాన మురళీధర్, గుత్తు చిన్నారావు, పొన్నాడ వెంకట సత్యనారాయణ, నక్క శంకరరావు, కిల్లాన ఫల్గుణరావు, పీఏఎన్ శాస్త్రి, వీవీఆర్ మూర్తి, బత్తుల జ్యోతి, కర్రి అశోక్‌కుమార్, లాడి చంద్రశేఖర్, రాజు, కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.


