భువనేశ్వర్: అలిపింగల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడుగా పనిచేస్తున్న పాదరాజ్ ఉమాకాంత నాయక్ 2026 సంవత్సరానికి ప్రతిష్టాత్మక జాతీయ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. పాఠశాల విద్య, వినూత్న బోధన, సైన్స్ విద్యను ప్రోత్సహించడంలో ఆయన చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఈ అవార్డు ప్రదానం చేయనున్నారు. 2004 ఫిబ్రవరి 20న పాదరాజ్ ఉమాకాంత నాయక్ బారాముండలిలోని మరీచ్‌పూర్ ఉన్నత పాఠశాలలో అసిస్టెంట్ టీచర్‌గా తన అధ్యాపక వృత్తి రంగంలోకి అడుగుపెట్టారు. వినూత్న, అనుభవపూర్వక అభ్యాస పద్ధతుల ద్వారా తరగతి గది బోధనను మెరుగుపరచడంలో ఆయన కృషి అనన్యం. రెండు అంతర్జాతీయ, నాలుగు జాతీయ సమావేశాలలో విద్య బోధనా శాస్త్రంపై పరిశోధనా పత్రాలను సమర్పించారు. ఇది విద్యా పరిశోధన, వృత్తిపరమైన అభివృద్ధి పట్ల అయన నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. ఆయన రచించిన పుస్తకం బిజ్ఞానొ ఘొరె పరీక్ష ప్రచురితమై రాష్ట్ర మాధ్యమిక విద్యా బోర్డు గుర్తింపు సాధించింది. ఈ పుస్తకం పాఠశాల ప్రయోగశాలలో, ఇంట్లో అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించి నిర్వహించ గల సరళమైన , ఆచరణాత్మక ప్రయోగాల్ని విద్యార్థులకు పరిచయం చేసింది. పాదరాజ్ ఉమాకాంత నాయక్ అనేక ఈ–కంటెంట్‌లను అభివృద్ధి చేశారు. రాష్ట్ర పాఠశాలలు, సామూహిక విద్యా విభాగం నిర్వహించిన యూట్యూబ్ లైవ్ క్లాస్‌ల ద్వారా పాఠాలను బోధించారు. ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్, రీసెర్చ్ బేస్డ్ లెర్నింగ్, హ్యాండ్ ఆన్ యాక్టివిటీస్, లెర్నింగ్ త్రూ డ్యాన్స్, టెక్నాలజీ బేస్డ్ లెర్నింగ్, లర్నింగ్ త్రూ యోగా, గేమ్ బేస్డ్ లెర్నింగ్ అండ్ లెర్నింగ్ సైన్స్ త్రూ ఆర్ట్ విధానాలు బోధన, అభ్యాస ప్రక్రియను మరింత ఆనందంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్ది విద్యార్థి కేంద్రీకృతం అయ్యాయి. ఫిజికల్ సైన్స్, మ్యాథమెటిక్స్‌లో స్టేట్ రిసోర్స్ పర్సన్‌గా పని చేస్తున్న పాదరాజ్ ఉమాకాంత నాయక్ ఉపాధ్యాయుల విద్యా సామర్థ్యాన్ని బలోపేతం చేసి సైన్స్, గణిత విద్యకు వినూత్న విధానాలను ప్రోత్సహించడానికి కూడా దోహదపడ్డారు. అతని మార్గదర్శకత్వంలో ఒక విద్యార్థి అంతర్జాతీయ స్థాయి సైన్స్ ఈవెంట్‌లో, మరో 8 మంది విద్యార్థులు జాతీయ స్థాయి సైన్స్ ఈవెంట్‌లలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయన విద్యార్థులలో శాసీ్త్రయ జిజ్ఞాస, ప్రతిభను పెంపొందించడంలో అతని పాత్రను చాటుకున్నారు. విద్యకు ఆయన చేసిన విశేష కృషికి గాను పాదరాజ్ ఉమాకాంత నాయక్‌ను గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి శిక్ష్యా పురస్కార్, ఒడిశా ప్రభుత్వం నుంచి ప్రకృతి బంధు అవార్డుతో సత్కరించారు.


