రాయగడ: జిల్లాలోని రామనగుడ సమితి పెనకాం గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలొ పోలీస్ కానిస్టేబుల్ దుర్మరణం పాలయ్యాడు. మృతుడిని కిషోర్‌కుమార్ పతి(39)గా గుర్తించారు. ఈమర రాయగడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కుంభికోట ఔట్‌పోస్టు వద్ద కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తుండేవారు. స్థానిక డీఆర్‌డీఏ సమావేశ మందిరంలో ఆర్‌డీసీ సమావేశం నిర్వహిస్తున్న నేపథ్యంలో రాయగడలో విధులు నిర్వహించేందుకు సంబంధిత అధికారులు పంపించారు. ఈ క్రమంలో విధులు నిర్వహించి మంగళవారం సాయంత్రం ఇంటికి బైక్‌పై వెళ్తుండగా రామనగుడ సమీపంలో ఆగి ఉన్న ఆటోను బలంగా బైక్‌తో ఢీకొన్నాడు. ఈ ఘటనలో తీవ్రగాయాలు కావడంతో రామనగుడ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గుణుపూర్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.
దివ్యాంగుల సంక్షేమమే ధ్యేయం
రాయగడ: దివ్యాంగుల సంక్షేమమే ధ్యేయంగా జిల్లాలోని పద్మపూర్‌లో సామాజిక భద్రత, దివ్యాంగుల సాఽధికారత శాఖ ఆధ్వర్యంలో బుధవారం సమితి కార్యాలయం ప్రాంగణంలో బీమ్‌భొయ్ దివ్యాంగుల సామర్థ్య శిబిరం నిర్వహించారు. పంచాయతీ సమితి అధ్యక్షురాలు మణిమాల సబర్, ఉపాధ్యక్షుడు రమేష్‌చంద్ర సాహు, జిల్లా పరిషత్ అధ్యక్షుడు రవినారాయణ ఆచార్య, బీడీఓ కురేష్ చంద్ర జాని, జిల్లా సామాజిక భద్రత అధికారి ఎలిజబెత్ గొరడ, సబ్ డివిజనల్ అధికారి శ్రీకాంత్ కుమార్ పాణిగ్రహి తదితరులు హాజరయ్యారు. 244 మంది దివ్యాంగులు హాజరుకాగా, అర్హులైన వారికి వీల్ చైర్లు, ట్రైసైకిళ్లు, సీపీ చైర్లు, వినికిడి పరికరాలు పంపిణీ చేశారు. జిల్లా ప్రధాన ఆస్పత్రి వైద్య బృందం ఆధ్వర్యంలో 138 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.
రైతుపై ఎలుగుబంట్ల దాడి
జయపురం: జయపురం సబ్ డివిజన్ బొరిగుమ్మ సమితి గ్రామాల్లో ఎలుగు బంట్లు దాడులకు తెగబడుతున్నాయి. బొడిగాం గ్రామంలో గుప్తేశ్వర్ నాయిక్ అనే రైతుపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. బుధవారం ఉదయం బహిర్భూమికి వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వెంటనే స్థానికులు స్పందించి అంబులెన్సులో జయపురం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు.
ఇద్దరు బాలల దత్తత
పర్లాకిమిడి : గజపతి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో బుధవారం జిల్లా పాలనాధికారి అక్షయ సునీల్ అగర్వాల్ చాంబర్‌లో ఇద్దరు మగపిల్లలను జర్సుగుడ జిల్లా దంపతులకు చట్టబద్ధంగా దత్తతకు అప్పగించారు. ఇప్పటి వరకు గజపతి జిల్లా నుంచి దేశ, విదేశాలకు 89 మందిని జిల్లా దత్తత కేంద్రం, రాణిపేట ద్వారా అందజేశారు. ఏడాది క్రితం ఈ ఇద్దరు పిల్లలను ఓ తల్లి ఆస్పత్రి వద్ద వదిలివెళ్లిపోవడంతో జిల్లా శిశు సంక్షేమ సమితి అఽధికారులు చేరదీసి కాశీనగర్ బ్లాక్ రాణిపేటలో ఉన్న స్వతంత్ర దత్తత సంరక్షణ కేంద్రం (నిస్సాన్ సలోం) అధికారులు సంరక్షించారు. అన్నదమ్ముల వయస్సు 4, 5 ఏళ్లు. వీరిని జర్సుగుడ దంపతులు కేంద్ర దత్తత పోర్టల్‌లో దరఖాస్తు చేసుకున్న అనంతరం బుధవారం కలెక్టర్ అగర్వాల్ చేతులమీదుగా అందజేశారు. కార్యక్రమంలో జిల్లా శిశు సంక్షేమ సమితి చైర్మన్ అమియా కుమార త్రిపాఠి, డి.సి.పి.ఓ.అరుణ్ కుమార్ త్రిపాఠి, ఇతర అధికారులు పాల్గొన్నారు.


