రాయగడ: క్రమశిక్షణతో విద్యను అభ్యసిస్తే వారి అభ్యున్నతికి అదే బాటలు వేస్తుందని మజ్జిగౌరీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (మిట్స్) గ్రూపుల చైర్మన్ బాలక్రిష్ణ పండ అన్నారు. కొలనార సమీపంలోని మిట్స్ కళాశాల ప్రాంగణం ఆడిటోరియంలో బుధవారం కొత్త విద్యార్థులకు ఆహ్వానించే ప్రక్రియలో భాగంగా నిర్వహించిన దీక్షారంభ్ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. నేటి విద్యా విధానంలో పోటీతత్వం పూర్తిగా పెరిగిందని అన్నారు. అందుకు అనుగుణంగా విద్యార్థులు విద్యను అభ్యసించాల్సిన అవసరం ఉందన్నారు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంతో పాటు వారి లక్ష్యం వైపు అడుగులు వేసేందుకు నిరంతరం కృషి చేయాలని అన్నారు. రాయగడ వంటి వాణిజ్య పట్టణంలో 1999లో మిట్స్ గ్రూప్ విద్యా సంస్థలను ప్రారంభించామని వివరించారు. అంచెలంచెలుగా ఎదిగిన ఈ సంస్థలో చదివే విద్యార్థులు వారి భవిష్యత్‌ను ఉజ్వలంగా మార్చుకున్నారన్నారు. విద్యావిధానానికి అనుగుణంగా కోర్సులను ఏర్పాటు చేశామని వివరించారు. ఆదివాసీ, హరిజన ప్రాంతంగా గుర్తింపు పొందిన జిల్లాలో సామాన్యులు కూడా తమ సంస్థలో చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నారన్నారు. విద్యను వ్యాపార దృక్పథంతో కాకుండా అందరికీ అందుబాటులొ ఉండే విధంగా తమ ప్రణాళికలను రూపొందిస్తుండటంతో సుదూర ప్రాంతాల నుంచి ఎంతోమంది విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారన్నారు. మిట్స్ గ్రూప్‌ల డైరెక్టర్ డాక్టర్ సి.వి.గొపినాథన్ సంస్థ ప్రత్యేకతలను వివరించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. డీఈఎన్ డాక్టర్ సంతను మహాంతి, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రామనుజ నాయక్ పాల్గొన్నారు.


