ఇచ్చేదే సగం..
● విడుదల కాని పాఠశాలల
నిర్వహణ ఖర్చులు
● చేతిచమురు వదిలించుకుంటున్న
హెచ్ఎంలు
● గత రెండేళ్లలో సగం నిధులే
విడుదల
త్వరలో నిధులు
పాఠశాలల నిర్వహణకు సంబంధించి నిధుల చెల్లింపు విషయమై ప్రభుత్వానికి నివేదించాం. త్వరలో నిధులు విడుదలయ్యే అవకాశం వచ్చింది. వచ్చిన వెంటనే ఆయా హెచ్ఎంల ఖాతాల్లో జమ చేస్తాం. – పి.వేణుగోపాలరావు,
సమగ్ర శిక్ష ఏపీసీ, శ్రీకాకుళం
హిరమండలం: ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ తలకుమించిన భారంగా మారుతోంది. విద్యా సంవత్సరం ప్రారంభమై మూడు నెలలు సమీపిస్తున్నా ఇంతవరకూ పాఠశాలల నిర్వహణకు సంబంధించి నిధులు విడుదల కాలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత రెండు విద్యా సంవత్సరాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. అప్పట్లో 50 శాతం నిధులు మాత్రమే విడుదలయ్యాయి. దీంతో పాఠశాలల నిర్వహణ చాలా కష్టంగా మారింది. ఇప్పుడు పాఠశాలలు తెరిచి మూడు నెలలు అవుతున్నా నిధులు విడుదల కాకపోవడంతో హెచ్ఎంలు, ఉపాధ్యాయులు సొంత డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తోంది.
జిల్లాలో ఇదీ పరిస్థితి...
జిల్లాలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 2,015, ప్రాథమికోన్నత పాఠశాలలు 151, ఉన్నత పాఠశాలలు 450 ఉన్నాయి. మొత్తం విద్యార్థులు 1,53,918 మంది ఉన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల నిర్వహణకు ఏటా రూ.3 కోట్ల వరకు ఖర్చవుతోంది. చాక్‌పీస్‌లు, డస్టర్లు, స్టేషనరీ సామగ్రి, విద్యార్థుల మార్కుల నమోదు పత్రాలు, దస్త్రాలు, చీపుర్లు, ఇతర వస్తువులు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. పాఠశాలలోని తరగతుల విద్యార్థులను బట్టి ఈ నిధుల కేటాయింపు ఉంటుంది. 1 నుంచి 20 మంది విద్యార్థులుంటే ఏడాదికి రూ.10 వేలు, 21 నుంచి 50 మంది విద్యార్థులుంటే రూ.15 వేలు, 51 నుంచి 100 మంది ఉంటే రూ.20 వేలు, 101 నుంచి 250 మంది ఉంటే రూ.50 వేలు, 251 నుంచి 1000 మంది ఉంటే రూ.75 వేలు కేటాయిస్తారు. పాఠశాలలకు సంబంధించి విద్యుత్ చార్జీలను సైతం ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది.
చెల్లింపుల్లో జాప్యం
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిధుల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో పాఠశాలల్లో హెచ్ఎంలు, ఉపాధ్యాయులు సొంత చేతి చమురు వదిలించుకోవాల్సి వస్తోంది. 2024–25, 2025–26 విద్యా సంవత్సరాలకు సంబంధించి కేవలం 50 శాతం నిధుల చెల్లింపు మాత్రమే జరిగింది. ఈ రెండేళ్లలో కేవలం రూ.3.80 కోట్లు ప్రభుత్వం జమ చేసింది.
ఈ లెక్కన ఒక విద్యాసంవత్సరంలో నిధులు రానట్టే. ఇప్పుడు విద్యా సంవత్సరం ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా ఇంకా పైసా కూడా విడుదల చేయలేదు. దీంతో పాఠశాల నిర్వహణకు సంబంధించి ఇబ్బందులు తప్పడం లేదు. విద్యాశాఖ విషయంలో ప్రచార ఆర్భాటానికే ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారన్న విమర్శలున్నాయి. ఇప్పటికై నా ప్రభుత్వం దృష్టిసారించాల్సిన అవసరం ఉంది.


