భువనేశ్వర్: పశ్చిమ బెంగాల్ దీఘా జగన్నాథ ధామ్ పేరులోని ధామ్ అనే పదాన్ని తొలగించాలని కోరుతు రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి లేఖ రాశారు. జగన్నాథ ధామ్ హిందూ మతంలోని నాలుగు ధామాల్లో ఒకటి అని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో దీఘా శ్రీ జగన్నాథ ఆలయానికి ప్రత్యామ్నాయ పేరు పెట్టాలని ముఖ్యమంత్రి అభ్యర్థించారు. ఈ సందర్భంగా దీఘా జగన్నాథ ధామ్ పేరుపై సర్వత్రా అసంతృప్తి వ్యక్తమైన విషయాన్ని గుర్తు చేశారు.
ఘనంగా రోజో క్వీన్–2026 పోటీలు
రాయగడ: ఒడిశా సంప్రదాయంలో భాగమైన రోజో పండగ వేడుకల సందర్భంగా నిర్వహించిన రోజో క్వీన్–2026 సీజన్–2 పోటీలు పట్టణంలోని వంశీక్రిష్ణ సమావేశం హాల్‌లో సోమవారం సాయంత్రం ఆత్యంత ఘనంగా జరిగాయి. జిల్లా నలుమూల నుంచి వచ్చిన 40 మంది బాలబాలికలు, యువతులు పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వంశీక్రిష్ణ ట్రస్ట్ ఎండీ మధురవాణి, గౌరవఅతిథులుగా జిల్లా సమాచార, పౌరసంబధాల శాఖ అధికారి దేవరాజ్ టక్రీ, ఆల్బమ్ హీరోలు ప్రీతమ్ కుమార్ పాణి, ఇసాక్‌రాజ్‌లు హాజరయ్యారు. రోజోక్వీన్ పోటీలు అత్యంత ఆసక్తికరంగా కొనసాగాయి. సబ్ జూనియర్, సీనియర్, విభాగాల్లో రోజోక్వీన్ పోటీలతో పాటు మెహందీ, ముగ్గులు, పొడోపిఠా, నృత్యం, గానం వంటి ఐదు అంశాల్లో ఔత్సాహికులు పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. అనంతరం విజేతలకు ముఖ్యఅతిథిగా హాజరైన మధురవాణి బహుమతులను అందజేశారు.
దేబాశిష్ సామంత్రాయ్
నామినేషన్ ఖరారు
భువనేశ్వర్: రాజ్యసభ ఉప ఎన్నికకు దేబాశిష్ సామంత్రాయ్ దాఖలు చేసిన నామినేషన్ పత్రాలు ఖరారయ్యాయి. భారతీయ జనతా పార్టీ నుంచి రాజ్య సభ అభ్యర్థిగా దేబాశిష్ సామంత్రాయ్ పోటీ చేస్తున్నారు. పరిశీలన అనంతరం ఆయన దాఖలు చేసిన 4 సెట్ల నామినేషన్ దస్తావేజులు ఖరారైనట్లు అధికారికంగా ప్రకటించారు.
భువనేశ్వర్: భారత వాతావరణ శాఖ (ఐఎమ్‌డీ) సమాచారం ప్రకారం రాగల రెండు మూడు రోజుల్లో నైరుతి రుతు పవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. రాష్ట్రం అంతటా రుతు పవనాలకు ముందు వర్షాలు తీవ్రమయ్యే సంకేతాల్ని ఐఎండీ జారీ చేసింది. బంగాళా ఖాతం నుంచి రుతు పవనాల కదలికకు సానుకూల వాతావరణం నెలకొని ఉంది. రుతు పవనాల పురోగతికి వాతావరణ పరిస్థితులు మరింత అనుకూలంగా మారాయని వాతావరణ శాఖ తెలిపింది. గత కొన్ని రోజులుగా పలు జిల్లాల్లో అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి. తేమతో కూడిన గాలుల ప్రవాహం కారణంగా రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో తేమతో కూడిన పరిస్థితులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం పలు చోట్ల కురుస్తున్న వర్షాలు రుతుపవనాలకు ముందు జరిగే కార్యకలాపాలకు దోహదపడేవిగా వాతావరణ వాతావరణ శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.
రుతు పవనాలు రాష్ట్రంలో చొరబడిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలు జిల్లాల్లో కాల వైశాఖి అలజడి కొనసాగుతోంది. అనేక ప్రాంతాల్లో పగటి పూట వేడి, తేమతో కూడిన వాతావరణం నెలకొని మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఈ వాతావరణ సరళి మరి కొద్ది రోజులు కొనసాగే అవకాశం ఉంది.


