భువనేశ్వర్: స్వయం సహాయక బృందాలను సూక్ష్మ, లఘు, మధ్య తరహా పరిశ్రమలుగా (ఎంఎస్‌ఎమ్‌ఈ) మార్చేందుకు ఐఐటీ భువనేశ్వర్, ఒడిశా జీవనోపాధి మిషన్‌తో అవగాహన ఒప్పందం కుదిరింది. క్షేత్ర స్థాయిలో వ్యవస్థాపకతను పెంపొందించే దిశగా ఒక కీలక అడుగు వేస్తూ ఐఐటీ భువనేశ్వర్, ఒడిశా జీవనోపాధి మిషన్ (ఓఎల్‌ఎమ్) ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి. స్వయం సహాయక బృందాలను సూక్ష్మ, లఘు, మధ్య తరహా పరిశ్రమలుగా (ఎంఎస్‌ఎమ్‌ఈ) మార్చే లక్ష్యంతో ఒక వ్యవస్థీకృత ఇంక్యుబేషన్ కార్యక్రమానికి ఇది నాంది పలికింది. ఐఐటీ భువనేశ్వర్ తరపున ప్రొఫెసర్ శ్రీపాద కర్మాళ్కర్, ఒడిశా ప్రభుత్వ ఉప ముఖ్య మంత్రి ప్రభాతి పరిడా మధ్య ఈ అవగాహన ఒప్పందం పత్రాల మార్పిడి జరిగింది. ఈ కార్యక్రమానికి ఒడిశా మిషన్ శక్తి శాఖ కమిషనర్ కమ్ కార్యదర్శి మానసి నింభాల్ మరియు మిషన్ శక్తి డైరెక్టర్ డాక్టర్ మోనికా ప్రియదర్శిని హాజరయ్యారు. ఈ కార్యక్రమం కింద ప్రతి ఇంక్యుబేటీకి ఉద్యమ్ రిజిస్ట్రేషన్, నియంత్రణ సమ్మతి, ఎంటర్‌ప్రైజ్ సర్టిఫికేషన్లల కోసం పూర్తి స్థాయి మద్దతు లభిస్తుంది. విలక్షణమైన ప్రాంతీయ గుర్తింపు, మార్కెట్ గుర్తింపును పెంపొందించే లక్ష్యంతో రాష్ట్రంలో ఎంపిక చేసిన కొన్ని ప్రత్యేక ఉత్పత్తుల కోసం పేటెంట్లను దాఖలు చేయడానికి, ఉత్పత్తి ధృవీకరణలను సులభతరం చేయడానికి ఐఐటీ భువనేశ్వర్ తన సాంకేతిక నైపుణ్యాన్ని అందిస్తుంది. ఈ ప్రాజెక్ట్‌కు ఐఐటీ భువనేశ్వర్‌లోని స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్ అండ్ మేనేజ్‌మెంట్‌కు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నిహార్ రంజన్ జెనా మరియు అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ దుఃఖ బంధు సాహు సారథ్యం వహిస్తారు. కార్యక్రమం రాష్ట్రంలో ఒక పటిష్టమైన వ్యవస్థాపక పర్యావరణ వ్యవస్థను సృష్టిస్తుంది. స్వయం సహాయక బృదాలకు వారి సంస్థలను విస్తరించి విస్తృత ఆర్థిక వ్యవస్థలో విలీనం చేసేందుకు అవసరమైన సంస్థాగత మద్దతు అందుబాటులోకి వస్తుంది.


