పర్లాకిమిడి: మహేంద్రగిరిలో జరుగుతున్న మేళా సందర్శించి తిరుగు ప్రయాణంలో ఆటో బ్రేకులు ఫెయిలై మడబా సమీపంలో బోల్తాపడిన సంఘటనలో ఐదుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. వారిలో ఇద్దరికి తీవ్ర గాయాలై పర్లాకిమిడి మెడికల్‌లో చికిత్స పొందుతున్నారు. రాయగడ బ్లాక్ బుర్జంగి నుంచి ఆటోలో మహేంద్రగిరి మేళాకు ఉదయం బయలుదేరిన ఆరుగురు ప్రయాణికులు అక్కడ మేళాను దర్శించుకుని తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో గౌతం ఘంట, (తల్లి) అనితా ఘంట తీవ్రంగా గాయపడ్డారు. మరో నలుగురికి సాధారణ గాయాలయ్యాయి. తొలుత కోయిపూర్ ఆరోగ్యం కేంద్రంలో ఫస్టు ఎయిడ్ చేసుకుని పర్లాకిమిడి ప్రభుత్వ కేంద్రాస్పత్రిలో చేరారు. గాయపడిన వారిలో మిట్టిపాణి, రజితా గంట, అథిక్ కోరోకోరే తదితరులు మెడికల్‌లో చికిత్స పొందుతున్నారు. సమయానికి అంబులెన్సు రాకపోవడంతో ప్రైవేటు వాహనంపై పర్లాకిమిడి మెడికల్‌కు క్షతగాత్రులు చేరుకున్నట్టు బాధితులు చెబుతున్నారు. ఇప్పటికి మహేంద్రం వెళ్లి మూడు ప్రమాదాలు చోటుచేసుకుని ఇద్దరు మృతి చెందారు.


