రాయగడ: రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో విస్తృతస్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణి తెలిపారు. అర్హత కలిగిన ఓటరు తన పేరును జాబితాలో కొనసాగేందుకు జాన్ 28వ తేదీలోగా గణన ఫారాన్ని తప్పనిసరిగా సమర్పించాలని సూచించారు. జిల్లాలో మొత్తం 7,14,700 మంది ఓటర్లు ఉండగా, పది రోజుల వ్యవధిలో సమారు 70 శాతం మంది ఓటర్లకు గణన ఫారాలను పంపిణీ చేసినట్టు వివరించారు. గుణపూర్ నియోజకవర్గంలో 2,34,902 మంది, రాయగడ నియోజకవర్గంలో 2,57,393 మంది ఓటర్లు ఉన్నట్టు వెల్లడించారు. పట్టణ ప్రాంతాల్లో ఓటర్లను గుర్తించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నందున ఫారాల పంపిణీ, సమాచారం సేకరణ ప్రక్రియ కొంత ఆలస్యమవుతుందని అధికారులు పేర్కొన్నారు. ఇదిలాఉండగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రాయగడ పట్టణంలో సబ్ కలెక్టర్ రమేష్ కుమార్ జెన్న ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అవగాహన రథం, ప్రచార వాహనాలతో పాటు వందలాది మంది ఓటర్లు, అధికారులు, ప్రజలు పాల్గొని ఓటరు చైతన్య నినాదాలతో పట్టణంలో ర్యాలీ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థుల ద్వారా యువ ఓటర్లు, వృద్ధులు, స్వచ్ఛంద సేవకులకు ఓటరు జాబితా సవరణ అవసరం, ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తున్నట్లు సబ్ కలెక్టర్ చెప్పారు. మంగళవారం పట్టణంలోని వివిధ ప్రాంతాల్లొ సబ్ కలెక్టర్ ఇంటింటా తిరిగి ఓటర్లకు అవగాహన కల్పించారు.
జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణి


