పర్లాకిమిడి: స్థానిక కొత్త బస్టాండు రోడ్డులో ఉన్న నయరా పెట్రోల్ బంకు వద్ద నిర్మాణంలో ఉన్న మురుగునీటి కాలువ రోడ్డుకు మధ్యలో నిర్మించారని, దీనిని తొలిగించి కొంచెం వెనక్కి నిర్మించాలని అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అధ్యక్షుడు పైల మురళీకృష్ణ ఇటీవల ఒకరోజు ఆందోళన చేపట్టారు. దీనిపై స్థానికులు పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి వినతిత్రం అందజేశారు. దీనిపై రోడ్లు–భవనాల శాఖ ఎస్‌ఈ అభిషేక్ శెఠితో ఎమ్మెల్యే మాట్లాడారు. ఈ డ్రైయిన్ వాటర్ పట్నాయక్ చెరువులోకి వెళ్లకుండా నేరుగా గుమ్మగెడ్డకు కలపాలని రోడ్లు–భవనాల శాఖ ఇంజినీర్లకు ఎమ్మెల్యే సూచించారు. దీంతో ఈ నిర్మాణ పనులు తిరిగి సోమవారం నుంచి మొదలయ్యాయి. ఈ డ్రైయిన్ నిర్మాణ వివాదంపై రాజకీయ నాయకుల ప్రామేయం ఉన్నందున పట్టణంలో అనేక అభివృద్ధి పనులు జరుగటం లేదని ఎమ్మెల్యే అన్నారు.


