● చిన్నారులను అక్కున చేర్చుకుంటున్న భవిత కేంద్రాలు ● మానసికోల్లాసంతో పాటు 21 రకాల సేవలతో సహిత విద్య ● నేటితో ముగియనున్న దివ్యాంగ చిన్నారుల గుర్తింపు సర్వే
నరసన్నపేట: ప్రత్యేక అవసరాల పిల్లల(దివ్యాంగులు)కు భవిత కేంద్రాలు ఆసరాగా నిలుస్తున్నాయి. జీవన ప్రమాణాలు మెరుగు పరుస్తున్నాయి. ఉచిత విద్య, వైద్యం, అవసరమైన ఉపకరణాలు, ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. ఈ కేంద్రాల్లో చేరేందుకు అర్హులైన దివ్యాంగ చిన్నారులను గుర్తించేందుకు మే 4 నుంచి సర్వే నిర్వహిస్తుండగా ఈ నెల 10తో ప్రక్రియ ముగియనుంది.
ఆసరాగా నిలుస్తూ..
ప్రత్యేక అవసరాల చిన్నారులు చాలాచోట్ల ఇంటికే పరిమితమయ్యేవారు. వీరిని బడికి పంపించే వీలు లేకపోవడంతో ఆలనాపాలనా తల్లిదండ్రులే చూసుకోవాల్సి వచ్చేది. ఇటువంటి పిల్లలను గుర్తించి వారికి అవసరమైన సహిత విద్యను అందించేందుకు భవిత కేంద్రాలు ఉపకరిస్తున్నాయి. అప్పట్లో భవిత కేంద్రాలు ఎక్కడో ఆమడ దూరంలో ఉండేవి. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో వీటిని ప్రభుత్వ పాఠశాల ఆవరణలోనికి మార్చారు. అప్పటి నుంచి ప్రత్యేక అవసరాల పిల్లలు భవిత కేంద్రాల ద్వారా వారి అవసరాలను వారు సొంతంగా చేసుకొనే స్థితికి వస్తున్నారు. తల్లిదండ్రులు భవిత కేంద్రాల నిర్వహణపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక అవసరాల పిల్లలకు అందచేసే సహిత విద్యను విద్యా శాఖలో భాగమైన సమగ్ర శిక్షా పథకం ద్వారా నిర్వహిస్తున్నారు.
21 రకాల సేవలు..
చిన్నారులకు ఉదయం 9 నుంచి సాయంత్రం 3 గంటల వరకూ సంరక్షించి 21 రకాల సేవలతో కూడిన సహిత విద్య బోధిస్తున్నారు. మధ్యాహ్న భోజనంతో పాటు మానసిక ఉల్లాసానికి అవసరమైన ఆటపాటలతో ఉత్తేజపరిచి ప్రోత్సహిస్తున్నారు. నరసన్నపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలతో పాటు జలుమూరు మోడల్ ప్రైమరీ స్కూల్, సారవకోట ఎంఆర్‌సీ పక్కన ఉన్న ప్రైమరీ స్కూల్, పోలాకి నర్సాపురం ఎంపీపీఎస్ తదితర చోట్ల భవిత కేంద్రాలు నిర్వహిస్తున్నారు. ప్రతివారం చిన్నారులకు ఫిజియోథెరపీ చేయిస్తున్నారు. నరసన్నపేటలో సోమవారం చేస్తుండగా మిగిలిన మండలాల్లో ఇతర రోజుల్లో చేస్తున్నారు. వైకల్యాన్ని తగ్గించేందుకు తేలికపాటి యోగాసనాలు, ఎక్సర్‌సైజులు వివరిస్తున్నారు. తల్లిదండ్రులకు కూడా సూచనలు చేస్తున్నారు. మంచానికే పరిమితమైన వారిని వారంలో రెండుసార్లు గృహ సందర్శన చేసి సహిత ఉపాధ్యాయుల ద్వారా ఫిజియోథెరపీ సేవలు అందిస్తున్నారు.
ఉపకరణాలు..
భవిత కేంద్రాలకు వచ్చే దివ్యాంగ చిన్నారులకు ప్రత్యేక పరికరాలను అందచేస్తున్నారు. సమగ్ర శిక్షా ద్వారా వీల్ చైర్లు, ట్రై సైకిళ్లు, హియరింగ్ మిషన్లు, సీపీ వీల్ చైర్, రొలేటర్స్ వంటివి పంపిణీ చేయడంతో పాటు కేంద్రాలకు వచ్చే పిల్లలకు రవాణా చార్జీలు సైతం చెల్లిస్తున్నారు.
మా అబ్బాయి సింహచలం వయసు 13 ఏళ్లు. మాటలు రాకపోవడం, వినికిడి సమస్య కారణంగా ఇంటికే పరిమితమయ్యేవాడు. భవిత కేంద్రానికి పంపడం ద్వారా చదవడం నేర్చుకుంటున్నాడు. ఆటల్లోనూ ఉత్సాహంగా ఉన్నాడు. ఆరోగ్యంపరంగా చాలా మెరుగైంది.
– రమణ, కొత్తపేట, నరసన్నపేట మండలం
ప్రత్యేక అవసరాల చిన్నారులపై తల్లిదండ్రులు తగిన శ్రద్ధ చూపాలి. క్రమం తప్పకుండా భవిత కేంద్రానికి పంపిస్తే వారిలో ఉత్సాహం కలుగుతుంది. రోజూ వారికి అవసరమైన శారీరక శిక్షణ కూడా ఇంటి వద్ద అందించాలి.
– శ్రీనివాసరావు, ఐఈఆర్‌టీ, నరసన్నపేట


