నేల ఆరోగ్యాన్ని కాపాడదాం | - | Sakshi
Sakshi News home page

నేల ఆరోగ్యాన్ని కాపాడదాం

Jun 10 2026 12:55 AM | Updated on Jun 10 2026 12:55 AM

రణస్థలం: నేల ఆరోగ్యాన్ని కాపాడటంలో భాగంగా సేంద్రియ ఎరువులు, పచ్చిరొట్ట, జీవన ఎరువుల ప్రాముఖ్యతను ప్రతి రైతు తెలుసుకోవాలని రైతు శిక్షణా జిల్లా కేంద్రం డిప్యూటీ డైరెక్టర్‌ ఆర్‌.శ్రీనివాసరావు అన్నారు. రణస్థలం మండలం తెప్పలవలసలో ఖేతి బచావ్‌ కార్యక్రమంలో భాగంగా రైతులకు శిక్షణ, అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి, మొక్కజొన్న, కొబ్బరి, ఆయిల్‌ ఫామ్‌ పంటలలో మేలైన యాజమాన్య పద్ధతులు వివరించారు. ప్రకృతి వ్యవసాయంలో భాగంగా వ్యవసాయ శాఖ ద్వారా ఇస్తున్న పీఎండీఎస్‌ కిట్లు వినియోగించుకోవాలని సూచించారు. డ్రోన్‌ ద్వారా నానో ఎరువుల స్ప్రేయింగ్‌ చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆమదాలవలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు జి.ఎస్‌.రాయ్‌, కె.హరికుమార్‌, బి.జ్యోతిబసు, ఏవోలు వై.సురేష్‌, విజయభాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎంఎస్‌ఎంఈ పార్కుకు

శంకుస్థాపన

పొందూరు: వీఆర్‌గూడెంలో సర్వేనంబరు–137లో 30 ఎకరాలలో రూ.10.45 కోట్లతో ఎంఎస్‌ఎంఈ పార్కు ఏర్పాటుకు కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు, పీయూసీ చైర్మన్‌ కూన రవికుమార్‌లు మంగళవారం శంకుస్థాపన చేశారు. ఎంఎస్‌ఎంఈ పార్కుతో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని చెప్పారు. కార్యక్రమంలో జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌, ఆర్డీఓ సాయిప్రత్యూష, మాజీ ఎమ్మెల్సీ విశ్వప్రసాద్‌, బలగ శంకర్‌ భాస్కర్‌, చిగిలిపల్లి రామ్మోహన్‌రావు, బాడాన గిరి, అధికారులు పాల్గొన్నారు.

ఇంధన ధరలు తగ్గించాలి

పలాస: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన డీజిల్‌, పెట్రోలు, గ్యాస్‌ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ వివిధ ప్రజా సంఘాల నాయకులు మంగళవారం పలాస ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్డీవో అప్పలరాజుకు వినతిపత్రం అందజేశారు. నిరసన కార్యక్రమంలో ప్రగతిశీల కార్మిక సమాఖ్య జిల్లా కమిటీ కార్యదర్శి పుచ్చ దుర్యోధనరావు, అధ్యక్షుడు మద్దిల ధర్మారావు, రైతాంగ కమిటీ నాయకులు దాసరి శ్రీరాములు, కారి పురుషోత్తం, మురిపింటి గంగయ్య, గర్తం కూర్మారావు, సాలిన వీరాస్వామి, మామిడి గణపతి, బి.లక్ష్మణరావు, బొడ్డు పాపారావు, పి.బాబూరావు తదితరులు పాల్గొన్నారు.

ఒడిశా మద్యం కలిగిన వ్యక్తికి ఆరు నెలల జైలుశిక్ష

పాతపట్నం: ఒడిశా రాష్ట్రం మద్యం బాటిళ్లతో పట్టుబడిన వ్యక్తికి పాతపట్నం కోర్టు జూనియర్‌ సివిల్‌ జడ్జి ఎం.రోషిణి ఆరు నెలల పదిహేను రోజులు జైలు శిక్ష విధించారని ఎకై ్సజ్‌ ప్రొహిబిషనల్‌ సీఐ కోట కృష్ణారావు మంగళవారం తెలిపారు. 2022 అక్టోబర్‌లో ఒడిశా రాష్ట్రం నుంచి మద్యం బాటిళ్లను వటుకుళ్ల శంకరరావు తీసుకువస్తుండగా అప్పటి ఎకై ్సజ్‌ ఎస్‌ఐ దస్తాగిరి పట్టుకుని కేసు నమోదు చేశారని పేర్కొన్నారు.

రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలు

సోంపేట: ఒడిశా రాష్ట్రం మహేంద్రగిరి పరిసర ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సోంపేట మండలం ఎం.జి.పురం పంచాయతీ హంసమొర గ్రామానికి చెందిన నలుగురు గాయపడ్డారు. ఉదయ్‌ గౌడో కుటుంబ సభ్యులు మహేంద్రగిరుల్లో జరుగుతున్న మేళాలో పాల్గొని తిరిగి వస్తుండగా కంబం ప్రాంతంలో వీరు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి పొలాల్లోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో సంజుగౌడో, సంతోష్‌, కృష్ణ, డ్రైవర్‌కు గాయాలయ్యాయి. క్షతగాత్రులను బరంపురం తరలించి వైద్యం అందిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement