శ్రీకాకుళం పాతబస్టాండ్: కర్నూలు జిల్లా వెంకయపల్లె గ్రామ రెవెన్యూ అధికారి మహమ్మద్ హుస్సేన్ ఆత్మహత్యకు కారణమైన అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని, ఉద్యోగుల సమస్యల పరిష్కరించాలని, రైస్ మిల్ కస్టోడియన్ అధికారులకు జారీ చేసిన షాకాజ్ నోటీసులను ఉపసంహరించుకోవాలని జిల్లా గ్రామ రెవెన్యూ అధికారులు, గ్రామ రెవెన్యూ సహాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం కలెక్టరేట్ వద్ద డచ్ భవనం సమీపంలో నిరసన చేపట్టారు. అనంతరం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా వీఆర్‌వో సంఘం నాయకుడు ప్రగడ వేణుగోపాల్, రాష్ట్ర నాయకుడు ఎం.అప్పలనాయుడు, జిల్లా కార్యదర్శి కోర్ల శ్రావణ్‌లు మాట్లాడుతూ జిల్లా జేఏసీ పిలుపు మేరకు గ్రామ రెవెన్యూ అధికారులు, గ్రామ సర్వేయర్లు, గ్రామ రెవెన్యూ సహాయకులు జిల్లా వ్యాప్తంగా నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హుస్సేన్ ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సిబ్బందిపై అధికారులు ఒత్తిడి పెరిగిందని, ఉద్యోగ భద్రత కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. పనిభారం తగ్గించి, శాఖాపరమైన విధులు మాత్రమే అప్పగించాలని కోరారు. ప్రభుత్వ సెలవులు, పండుగ దినాలలో విధులకు హాజరు కావాల్సిన పరిస్థితులు కల్పించకూడదన్నారు. రైస్ మిల్ కస్టోడియన్ అధికారులుగా నియమితులైన తాము ఎటువంటి వ్యక్తిగత ప్రయోజనాలు ఆశించకుండా నిబద్ధతతో విధులు నిర్వహించామని, ఇటీవల జారీ చేసిన షోకాజ్ నోటీసులను ఉపసంహరించుకుని, నిష్పాక్షిక విచారణ జరిపి చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో విలేజ్ సర్వేయర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మధుబాబు, వీఆర్‌ఏల సంఘం అధ్యక్షుడు గోపి, వీఆర్‌వో సంఘం కోశాధికారి కె.కె.ప్రసాద్, తౌడు తదితరులు పాల్గొన్నారు.


