కొరాపుట్: మండుటెండలో వెళ్తున్న వృద్ధురాలికి బీడీవో అండగా నిలిచి తన గమ్యస్థానానికి చేరి గొప్ప ఔదర్యాన్ని చాటుకున్నారు. నబరంగ్‌పూర్ జిల్లా తెంతులకుంటి సమితి బ్లాక్ డెవలప్‌మెంట్ అధికారి మనోజ్ పాణీగ్రహీ తన సమితిలో మంగళవారం క్షేత్ర పర్యటన చేస్తున్నారు. ఇదే సమయంలో మండుటెండలో గౌడగుడ గ్రామానికి చెందిన సుందేయ్ బాగ్ అనే 90 ఏళ్ల వృద్ధురాలు ప్రభుత్వ వైద్యశాల నుంచి ఇంటికి తన కుమార్తెతో కలిసి నడిచి వస్తుంది. తన వాహనంలో వెళ్తున్న బీడీవో ఆమెని దాటి వెళ్లి కొంతదూరం తర్వాత వాహనం ఆపారు. కారు తలుపు తీసేసరికి ఎండ తీవ్రత గట్టిగా తగిలింది. వెంటనే తాను వచ్చే మార్గంలో నడుస్తూ వస్తున్న వృద్ధురాలు గుర్తుకి వచ్చి వెంటనే తన వాహనాన్ని వెనక్కి తిప్పి ఆమె వద్దకు వచ్చారు. వారిద్దరిని వాహనంలో ఎక్కించుకొని నేరుగా వారింటివద్ద దింపారు. సంక్షేమ పథకాలు అందుతున్నాయా..లేదా అని ఆరాతీశారు. ప్రభుత్వం ఇచ్చిన ఇల్లు, రేషన్ కార్డు, పింఛన్ తదితర పథకాలు సక్రమంగా అందుతున్నట్లు నిర్థారించుకున్నారు. ఈ చిత్రాలు సోషల్ మీడియాలో రావడంతో బీడీవోపై ప్రశంసలు కురిపించారు.


