చోరీ కేసులో ఇద్దరికి మూడేళ్ల జైలు శిక్ష | - | Sakshi
Sakshi News home page

చోరీ కేసులో ఇద్దరికి మూడేళ్ల జైలు శిక్ష

Jun 9 2026 9:10 AM | Updated on Jun 9 2026 9:10 AM

పర్లాకిమిడి: కాశీనగర్‌ బ్లాక్‌ రాణిపేట గ్రామం, సింహానగర్‌లో గత ఏడాది నవంబరు 25న పట్టపగలు రెండుగంటల సమయంలో ఒక ఆటోడ్రైవరు జగన్నాథ ప్రదాన్‌ ఇంట్లో దొంగతనం చేస్తుండగా నిందితులు ఇద్దరు పట్టుబడ్డారు. సోమవారం జిల్లా కోర్టులో సబ్‌డివిజనల్‌ జుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ గాయత్రీ మిశ్రా ఇద్దరు నిందితులు సంజయ్‌ గాంధీ కాలనీకి చెందిన మంగళం చండీ, డోలాట్యాంకు నివాసి ఎన్‌.నాగరాజులకు ఐ.పి.సి. సెక్షన్‌ 305, 331 (5) ప్రకారం నిందితులుగా పరిగణింపబడి ఇద్దరికీ వేర్వేరుగా మూడేళ్ల కారాగార శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ తీర్పును వెల్లడించారు. ఈ కేసును ప్రభుత్వం తరపున ఏపీపీ కాశీనాథ్‌ దాస్‌ విచారించగా, సీనియర్‌ క్యాడర్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ రాజేష్‌ కుమార్‌మిశ్రా, ప్రారంభం నుంచి ప్రత్యక్షంగా సహకారం అందజేశారు. కేసులో జడ్జి ఐదుగురు సాక్షులను విచారించారు. ఈకేసు ఆదర్శ పోలీస్‌స్టేషన్‌ ఎస్‌ఐ జగన్నాథ ప్రధాన్‌ నిందితులను దొంగతనం జరిగిన చోటే పట్టుకోవడం విశేషం.

పూరీలో ముఖ్యమంత్రి హెలికాప్టర్‌ ల్యాండింగ్‌

భువనేశ్వర్‌: కాల వైశాఖి వైపరీత్యంతో నెలకొన్న ప్రతికూల వాతావరణ పరిస్థితుల ప్రభావంతో ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ మాఝీ పయనిస్తున్న హెలికాప్టర్‌ దారి మళ్లించారు. ముఖ్యమంత్రి మయూర్‌భంజ్‌ నుంచి తిరిగి వస్తుండగా వాతావరణం ఆకస్మిక మార్పుతో పూరీలో అత్యవసరంగా ల్యాండింగ్‌ చేశారు. హెలికాప్టర్‌ లో ప్రయాణిస్తున్న ముఖ్యమంత్రితో సహా అందరూ పూర్తిగా సురక్షితంగా ఉన్నారు. రాజధాని భువనేశ్వర్‌లో అకస్మాత్తుగా వాతావరణం క్షీణించడంతో ముఖ్యమంత్రి హెలికాప్టర్‌ పూరీ సమంగా తాత్కాలిక బస్‌ స్టాండులో అత్యవసరంగా ల్యాండ్‌ అయింది. భువనేశ్వర్‌ మీదుగా ఆకాశంలో నెలకొన్న ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు .

ఎమర్జెన్సీ కోటాపై కేంద్ర రైల్వే మంత్రికి ఫిర్యాదు

రాయగడ: ఎమర్జెన్సీ కోటా కింద రైలు బెర్త్‌ కేటాయింపు కోసం చేసిన దరఖాస్తుల పరిశీలనలో నిర్లక్ష్యం, ప్రభుత్వ ప్రొటోకాల్‌ ఉల్లంఘనతోపాటు ప్రజాప్రతినిధుల పట్ల అనుచిత పరిపాలనా వ్యవహారం జరిగిందని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు రాయగడ ఎమ్మెల్యే అప్పల స్వామి కడ్రక సోమవారం ఫిర్యాదు చేశారు. భువనేశ్వర్‌లో ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం రాయగడకు తిరిగి రావడానికి ఎమ్మెల్యే జూనాఘడ్‌ రోడ్డు ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణం కోసం టికెట్‌ బుక్‌ చేసుకున్నారు. ప్రయాణానికి సంబంధించి భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం ఎమర్జెన్సీ కోటా కింద బెర్త్‌ కేటాయించాలని సంబంధిత అధికారులకు విధివిధానాల ప్రకారం దరఖాస్తు సమర్పించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దరఖాస్తు సమర్పించిన తరువాత దాని స్థితిగతుల గురించి తెలుసుకునేందుకు రైల్వే అధికారులను సంప్రదించగా, దరఖాస్తును సరైన విధంగా పరిశీలించకపోవడంతోపాటు ఫోన్‌లో మాట్లాడిన అధికారులు పరిపాలన మర్యాదలకు విరుద్ధంగా ప్రవర్తించారని ఆరోపించారు. ఈ ఘటన ప్రజాప్రతినిధిగా తనను తీవ్రంగా బాధించడమే కాకుండా ప్రభుత్వ విధానాల అమలుపై ప్రశ్నలు తలెత్తేలా చేసిందన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర రైల్వే మంత్రిని ఉద్దేశించి ఎమ్మెల్యే పలు డిమాండ్లు చేశారు. ఎమర్జెన్సీ కోటా దరఖాస్తు పరిశీలనలో ఏవైనా పరిపాలనా లోపాలు, నిర్లక్ష్యం, ప్రొటోకాల్‌ ఉల్లంఘనలు జరిగాయా అనే అంశంపై నిష్పక్షపాత విచారణ చేపట్టాలని కోరారు. దరఖాస్తు ప్రొసెసింగ్‌లో పాల్గొన్న అధికారులు, సిబ్బంది బాధ్యతలను నిర్ధారించి చర్యలు తీసుకోవాలని విజ్ఞాప్తి చేశారు. ఫోన్‌ సంభాషణ సమయంలొ జరిగిన అనుచిత ప్రవర్తనపై కూడా విచారణ జరిపి అవసరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కొరారు. భవిష్యత్‌లో ప్రజాప్రతినిధులు సమర్పించే దరఖాస్తులను నిబంధనల ప్రకారం, సకాలంలో పరిశీలించేలా సంబంధిత అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని, ప్రజాప్రతినిధుల పట్ల గౌరవంగా మెలిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై రైల్వే శాఖ తీసుకునే చర్యలను తనకు లిఖితపూర్వకంగా తెలియజేయాలని కోరారు. కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఈ ఫిర్యాదును పరిగణలోకి తీసుకుని న్యాయపరమైన చర్యలు చేపడుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement