మల్కన్‌గిరి:
మల్కన్‌గిరి జిల్లా కోరుకొండ సమితిలో జిల్లా కలెక్టర్ ప్రధమేశ్ ఆధ్వర్యంలో సోమవారం గ్రీవెన్స్‌సెల్ నిర్వహించారు. సమితి పరిసర పంచాయతీల ప్రజల నుంచి మొత్తం 72 వినతులను అధికారులు స్వీకరించారు. వాటిలో కొన్ని వినతులను పరిశీలించిన కలెక్టర్ అక్కడికక్కడే పరిష్కరించారు. మిగిలిన వాటిని క్షుణ్ణంగా పరిశీలించి సకాలంలో పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వినతుల్లో భూవివాదాలు, సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన అంశాలు ఉన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ వినోద్ పటెల్, జిల్లా అటవీ శాఖ అధికారి సాయికిరణ్, జిల్లా అభివృద్ధి శాఖ అధికారి దశరధి సరాబు, కోరుకొండ సమితి అధ్యక్షులు పాల్గొన్నారు.
గుణుపూర్‌లో 20 వినతులు..
రాయగడ: జిల్లా కలెక్టర్ అశుతోస్ కులకర్ణి అధ్యక్షతన జిల్లాలోని గుణుపూర్‌లో వినతుల స్వీకరణ కార్యక్రమం సబ్ కలెక్టర్ కార్యాలయ సమావేశం హాల్‌లో జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి 20 వినతులను కలెక్టర్ స్వీకరించారు. వీటిలో ఐదు వినతులు వ్యక్తిగతమైనవిగా మిగతా 15 సామూహిక గ్రామ సమస్యలుగా గుర్తించారు. వినతుల్లో భాగంగా ఒకరికి రెడ్ క్రాస్ నిధుల నుంచి ఐదు వేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు. గ్రామ సమస్యలు పరిశీలించి వాటిని త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో గుణుపూర్ సబ్ కలెక్టర్ దుదూల్ అభిషేక్ అనీల్, గుణుపూర్ ఐటీడీఏ అధికారి అజయ్ కుమార్ ప్రధాన్, తహసీల్దార్ లీలావతి ఆచార్య, జిల్లా సంక్షేమ శాఖ అధికారి ఆసీమా రావ్ పాల్గొన్నారు.


