మరో 30 మందికి గాయాలు
పర్లాకిమిడి: మహేంద్రగిరిలో మేళాను సందర్శించి తిరిగి వస్తున్న యాత్రికుల పికప్ వ్యాను ఆదివారం రాత్రి గంజాం జిల్లా చికిటి నియోజకవర్గం పాత్రపురం బ్లాక్ ఓండోఓండా గ్రామం వద్ద ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందగా.. మరో 30 మందికి పైగా భక్తులకు గాయాలయ్యాయి. గంజాం జిల్లా పాత్రపురం బ్లాక్ జోరడా పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు.. ఆదివారం గజపతి జిల్లా కోయిపూర్ పంచాయతీ మహేంద్రగిరిపై జరుగుతున్న మహేంద్రమేళాకు పాత్రపురం బ్లాక్ ఓండోఓండా నుంచి కొందరు వచ్చారు. తిరిగి వెళ్తుండగా గ్రామం సమీపంలో గత రాత్రి పద కొండు గంటల సమయంలో పికప్ వ్యాన్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఒక మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో మహిళ పాత్రపురం మెడికల్‌లో మరణించినట్టు పోలీసులు చెబుతున్నారు. ఈ దుర్ఘటనలో ప్రతాప్ శెట్టి, లక్ష్మీ గౌడో, రేణు గౌడో, కలియా బెహారా, శిబరాం పాణిగ్రాహి, లక్ష్మీకాంత సాహు, సుభాషినీ బెహరా తీవ్రంగా గాయపడినట్టు పోలీసులు చెబుతున్నారు. సంఘటన స్థలంలో లభించిన సమాచారం మేరకు గంజాం జిల్లా నువాసాహి నుంచి 31 మందికి పైగా ఒక పికప్ వ్యాన్ భక్తులు మహేంద్రగిరికి వెళ్లారు. మహేంద్రంలో దర్శనాలు పూర్తిచేసుకుని ఆదివారం రాత్రి తిరిగి పికప్ వ్యాన్‌లో వస్తుండగా ఓండోఒండా గ్రామం సమీపంలో మహేంద్రగిరి రోడ్డులో పికప్ వ్యాను బ్రేకులు ఫెయిలై అదుపుతప్పి బోల్తా పడటంతో ఈ దుర్ఘటన జరిగింది. స్థానికులు క్షతగాత్రులను రక్షించి పాత్రపురం ప్రభుత్వ మెడికల్ సెంటర్‌కు తరలించారు. ఈ సంఘటన జరిగిన తర్వాత జోరడా పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలను నమోదు చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


