పేపర్‌ మిల్లు తీరుపై అసంతృప్తి | - | Sakshi
Sakshi News home page

పేపర్‌ మిల్లు తీరుపై అసంతృప్తి

Jun 9 2026 9:10 AM | Updated on Jun 9 2026 9:10 AM

రాయగడ: జిల్లాలోని అత్యంత ప్రతిష్టాత్మక, పురాతనమైన జేకేపూర్‌లో గల జేకేపేపర్‌ మిల్‌ సంస్థ గ్రామాల అభివృద్ధి కోసం చేసుకున్న అవగాహన ఒప్పందం నిబంధనలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తు బొడొచందిలి, సనొ చందిలి గ్రామాల ప్రజలు జిల్లా అదనపు కలెక్టర్‌ కార్యాలయానికి చేరుకుని ఏడీఎం నవీన్‌ చంద్ర నాయక్‌ను సోమవారం కలిసి వినతి పత్రం అందజేశారు. జేకేపేపర్‌ మిల్‌ స్థాపన కోసం తమ సాగుభూములను అప్పట్లో కంపెనీకి ఇచ్చామని, గ్రామాల సమగ్ర అభివృద్ధి, ఉపాధి ,విద్య, వైద్యం, తాగునీరు. పారిశుద్ధ్యం తదితర సౌకర్యాలను కల్పిస్తామని కంపెనీ హామీ ఇచ్చిందన్నారు. అయితే ఏళ్లు గడిచినా ఆ హామీలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయని ఆరోపించారు. గ్రామ యువతకు ఉద్యోగాలు కల్పించడంలో కంపెనీ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, స్థాఽనికుల కంటే బయట ప్రాంతాల వారికి ప్రాధాన్యత ఇస్తొందని పేర్కొన్నారు. ఉన్నత విద్య, సాంకేతిక విద్య కోసం ఆర్థిక సాయం, వైద్య శిబిరాలు, ఆంబులెన్స్‌ సౌకర్యం, స్వయం సంఘాలకు మద్దతు, కమ్యూనిటీ హాల్‌ నిర్మాణం, పారిశుద్ధ్య కార్యక్రమాలు వంటి హామీలు అమలు కాలేదని వినతిపత్రంలో పేర్కొన్నారు. అదేవిధంగా పేపర్‌ మిల్‌ నుంచి వెలువడుతున్న కాలుష్యంతో సమీప నదులు కలుషితమై సాగునీటి కొరత ఏర్పడిందని గ్రామస్తులు ఆరోపించారు. కాలుష్యం కారణంగా ప్రజలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని, రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement