నరసన్నపేట: మడపాం టోల్‌ప్లాజా వద్ద జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. ఉదయం 10.30 సమయంలో లారీ వెళ్తుండగా టైర్ కిందకు కావాలని ఓ వ్యక్తి పడిపోవడంతో ప్రమాదం జరిగినట్లు నరసన్నపేట పోలీసులు అనుమానిస్తున్నారు. దగ్గరలో ఉన్న సీసీ ఫుటేజీలను నరసన్నపేట ఎస్సై బలివాడ గణేష్ పరిశీలించారు. నడుచుకుంటూ వెళ్తున్న గుర్తు తెలియని వ్యక్తి పక్క నుంచి వస్తున్న లారీ కిందకు ఒక్క సారి దూకినట్లు గుర్తించారు. అయితే ప్రమాదానికి కారణాలు తెలియలేదు. మృతుడి వయసు 35 నుంచి 40 ఏళ్లు ఉంటుందని, గుండు గీసుకొని ఉన్నాడని, తెలుపు ఫ్యాంట్, నీలం చెక్స్ షర్ట్ వేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. వివరాలు తెలిస్తే పోలీసు స్టేషన్‌లో సంప్రదించవచ్చని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


