జాగ్రత్తలు తప్పనిసరి..
పాతపట్నం: వేసవి సెలవులు ముగుస్తున్నాయి. తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పించేందుకు మంచి విద్యాలయాల కోసం ఆరా తీస్తున్నారు. ఇప్పటికే పుట్టగొడుగుల్లా నూతన శాఖలను ప్రారంభించేందుకు కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్ల నిర్వాహకులు సర్వం సిద్ధం చేశారు. భారీస్ధాయిలో ప్రచారాలు చేస్తూ తల్లిదండ్రులను ఆకర్షించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయా సంస్థలపై విద్యాశాఖ నియంత్రణ కొరవడటంతో అనుమతులున్న పాఠశాలలను గుర్తించడంలో తల్లిదండ్రులు అయోమయానికి గురవుతున్నారు. కొత్త ప్రైవేటు పాఠశాల ప్రారంభించాలంటే విద్యాశాఖ అనుమతి తప్పనిసరి. ప్రాథమిక స్థాయికి జిల్లా విద్యాశాఖ అధికారి నుంచి, ఉన్నత తరగతులు ప్రారంభించాలంటే విద్యాశాఖ రీజనల్ డైరెక్టర్ (ఆర్జేడీ) ద్వారా పాఠశాల విద్యా కమిషనర్ అనుమతి పొందాలి. సీబీఎస్‌ఈ సిలబస్ బోధించేందుకు కేంద్ర విద్యామండలి సమ్మతించాలి.
అవగాహన ఉంటేనే..
గతంలో మెళియాపుట్టి మండల కేంద్రంలో ఓ పాఠశాలలో తమకు అన్ని అనుమతులు ఉన్నాయని ప్రచారం చేసుకోవడంతో తల్లిదండ్రులు వారి పిల్లలను ఆ విద్యా సంస్థలో చేర్చారు. ఫీజులు చెల్లించి, పుస్తకాలు సైతం తీసుకున్న తర్వాత రెండు నెలలు నడిపించారు. విద్యాశాఖ రీజనల్ డైరెక్టర్, కేంద్ర విద్యామండలి నుంచి ఎటువంటి అనుమతులు లేకపోవడంతో జిల్లా విద్యాశాఖ ఆ సంస్థను మూసివేసింది. దీంతో మరో పాఠశాలలో విద్యార్థులను విలీనం చేస్తుండటంతో నిర్వాహకులు చెప్పడంతో తల్లిదండ్రులు ఆందోళన చేశారు.
ఆరా తీయండి
ప్రతి విద్యా సంస్థ ప్రభుత్వం నుంచి కచ్చితంగా గుర్తింపు పొందాలి. చాలా విద్యాసంస్థల బోర్డులు, ప్రకటనలు నిశితంగా పరిశీలిస్తే రిజిస్టర్డ్ అని ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఎవరైనా చేసుకోవచ్చు. కానీ విద్యాశాఖ నుంచి గుర్తింపు తప్పనిసరి. గుర్తింపు పొందిన విద్యా సంస్థలలోనే తల్లిదండ్రులు పిల్లల ను చేర్పించాలి. కొన్ని పాఠశాలల యాజమాన్యాలు ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఇతర విద్యా సంస్థల తరఫున పరీక్షలు రాయిస్తుంటారు. అలా పరీక్ష రాసిన విద్యార్థులను ప్రభుత్వం ప్రైవేటు విద్యార్థిగానే పరిగణిస్తుంది. మరికొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు బ్రాంచీల పేరుతో పాఠశాలలను, కళాశాలలను నడుపుతూ ఎక్కడో ఉన్న మెయిన్ బ్రాంచి ద్వారా పరీక్షలు రాయిస్తుంటారు. ఇలాంటి విషయాలలో తల్లిదండ్రులు కచ్చితంగా అవగాహ న కలిగి ఉండాలి.
ప్రతి విద్యా సంవత్సరానికి అనుమతులు తప్పనిసరిగా ఉండాలి. ప్రైవేటు పాఠశాలలు ప్రతి సంవత్సరం విద్యాశాఖ, కమిషనర్ అనుమతులు పొందాలి. ఆయా పాఠశాలలు తప్పనిసరిగా రెవెన్యూవల్ చేసుకోవాలి.
– సీహెచ్ తిరుమలరావు,
ఎంఈవో–2, పాతపట్నం
తొలుత పాఠశాలలకు ప్రభుత్వ గుర్తింపు ఉందా లేదా అనేది చూసుకోవాలి.
ప్రభుత్వ ఇంజినీరింగ్ విభాగం జారీ చేసిన పాఠశాల భవనం నాణ్యత సర్టిఫికెట్‌ను పరిశీలించాలి.
మౌలిక వసతులు చూసుకోవాలి. మరుగుదొడ్లు, నీటి సదుపాయాలు తప్పనిసరి.
క్రీడా ప్రాంగణం, ఫిజికల్ ట్రైనర్ వివరాలు తెలుసుకోవాలి.
ప్రాథమిక, ప్రాథమికోన్నత స్థాయిలో 20 నుంచి 40 మందికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలి.
ఉన్నత పాఠశాలలైతే సబ్జెక్టుల వారీగా ఒకరు చొప్పున ఉపాధ్యాయుడు ఉండాలి.
సురక్షిత రవాణా సదుపాయానికి బస్సులకు రవాణా శాఖ సామర్థ్య పరీక్ష పత్రం ఉందో లేదో తెలుసుకోవాలి. సుశిక్షితుడైన డ్రైవర్ తప్పనిసరి.
జీ–1 భవనాలు ఉంటే అగ్నిమాపక పరికరాలు, స్థాయి దాటితే మంటలు ఆర్పే పూర్తిస్థాయి ఏర్పాట్లు ఉండాలి.
ప్రభుత్వం అనుమతి లేని పాఠశాలల్లో విద్యార్థులను చేర్చితే భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తుతాయి. చైల్డ్ ఇన్ఫో ఆధారంగానే విద్యార్థుల ప్రగతి పత్రాలు, బదిలీ ధ్రువపత్రాలు జారీ చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ అనుమతి లేని వాటిలో ఈ నమోదు ఉండదు. ఆయా విద్యార్థులను బడిబయట ఉన్నవారిగా పేర్కొంటున్నారు. ఫలితంగా సమస్యల ఏర్పతాయి.
ఆకట్టుకునే ప్రచారాలతో మోసపోవద్దు
పాఠశాలల పూర్తి సమాచారం తెలుసుకున్నాకే పిల్లలను చేర్పించాలి


