శ్రీకాకుళం అర్బన్: తిరుపతి విమానాశ్రయాన్ని ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్ర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయ త్నించడం తగదని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ధ్వజమెత్తారు. శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు అతిథి గృహంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుపతి విమానాశ్రయాన్ని ప్రైవేటీకరించేదుకే విమాన రాకపోకలు తగ్గించేశారని తెలిపారు. తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తాను కష్టపడి తీసుకువచ్చానని, అప్పట్లో ఒకాయన తన దగ్గరకు వచ్చి గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం చేసుకుంటానని తనతో చర్చిస్తే తాను ఒప్పుకోలేదని చెప్పారు. రాష్ట్రాభివృద్ధంతా కేవలం టీవీ చానెళ్లు, న్యూస్ చానెళ్లలో మాత్రమే తప్ప మరెక్కడా లేదన్నారు. తక్షణమే ప్రభుత్వం పీఆర్‌సీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మంత్రి నరసింహమూర్తి, షణ్ముఖరావు, మామిడి సత్యన్నారాయణ పాల్గొన్నారు.
అట్టహాసంగా
క్రీడాపోటీలు ఆరంభం
టెక్కలి: టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల రజతోత్సవ వేడుకల సందర్భంగా కాలేజీ మైదానంలో సోమవారం అంతర్ కళాశాలల క్రీడాపోటీలు అట్టహాసంగా ఆరంభమయ్యా యి. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ యూనివర్సిటీల నుంచి అధ్యాపకులు, విద్యార్థులకు నిర్వహిస్తు న్న ఈ పోటీలను కళాశాల డైరెక్టర్ వి.వి.నాగేశ్వరరావు, కార్యదర్శి ఎల్.ఎల్.నాయుడు, కోశాధి కారి టి.నాగరాజు తదితరులు ప్రారంభించా రు. మొదటి రోజు టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల, విజయనగరం ఎంవీజీఆర్ కళాశాల జట్లు తలపడ్డాయి. ఇందులో ఆదిత్య కళాశాల విజయం కై వసం చేసుకుంది. కార్యక్రమంలో డైరెక్టర్ టి.నాగశేషు, ప్రిన్సిపాల్ ఎ.ఎస్.శ్రీనివాసరావు, క్రీడా సమన్వయకర్త డి.శ్రీరాములు, సీఎఔన్‌ఎఎన్.రాజు, పీడీలు ఎస్.లక్ష్మణమూర్తి, టి.మురళీమోహన్, జె.తేజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
రిమాండ్ ఖైదీ మృతిపై
మెజిస్టీరియల్ విచారణ
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఇచ్ఛాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని కేదారిపురం గ్రామానికి చెందిన రిమాండ్ ఖైదీ భుక్త బలరామ్ (27) కస్టోడియల్ మరణంపై ఈ నెల 11న మెజిస్టీరియల్ విచారణ జరగనుంది. కలెక్టర్ ఆదేశాల మేరకు శ్రీకాకుళం రెవెన్యూ డివిజనల్ అధికారి, సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్‌ను విచారణ అధికారిగా నియమించారు. సదరు ఖైదీని క్రైమ్ నెం.31/2026 కేసులో ఇచ్ఛాపురం జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశాల ప్రకారం గత ఏప్రిల్ 8న రిమాండ్‌కు తరలించారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ నిబంధనల ప్రకారం ఈ ఘటనపై అవగాహన, సమాచారం, ఎలాంటి ఆధారాలైనా ఉన్న బంధువులు, ప్రజలు ఈ నెల 11న ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల లోపు శ్రీకాకుళం ఆర్డీవో కోర్టులో హాజరై సాక్ష్యం చెప్పవచ్చని విచారణ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. నేరుగా రాలేని వారు రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా గానీ, వ్యక్తిగతంగా గానీ ఈ నెల 16లోపు ఆర్డీవో కార్యాలయంలో సమర్పించవచ్చని పేర్కొన్నారు.
యువకుడిపై
పోక్సో కేసు నమోదు
సోంపేట: బారువ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ గ్రామానికి చెందిన యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు సీఐ బి.మంగరాజు తెలిపారు. ఏడో తరగతి చదువుతున్న బాలికను ఈ నెల 2న యువకుడు బైక్‌పై బయటకు తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక ఇంటి వద్ద లేకపోవడాన్ని గుర్తించిన తల్లిదండ్రులు బారువ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.
సిక్కోలు కవులకు సత్కారాలు
శ్రీకాకుళం కల్చరల్: రాజమండ్రి వేదికగా శ్రీశ్రీ కళావేదిక, జనచైతన్య సాహిత్య పరిషత్ నిర్వహణలో రెండు రోజుల పాటు జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలలో సిక్కోలుకు చెందిన పలువురు కవులను ఘనంగా సత్కరించారు. కవి సమ్మేళనంలో శ్రీకాకుళం అధ్యక్షుడు మణిపాత్రుని నాగేశ్వరరావు, కన్వీనర్ భోగిల ఉమామహేశ్వరరావు, ఐఎన్‌డీ ప్రసాదరావు, కిల్లాన శ్రీనివాసరావు, ఇద్ది పాపయ్య, ఎంటీవీ ఆర్.మూర్తి, తేజ లక్ష్మి, రుష్యశృంగుని ఢిల్లీశ్వరరావు, ముట్నూరు ఉపేంద్రశర్మ తదితరులు తమ కవితా గానాన్ని వినిపించారు. వీరిని శ్రీశ్రీ కళావేదిక జాతీయ చైర్మన్ కత్తిమండ ప్రతాప్, జాతీయ ప్రణాళిక అధికారి పార్థసారథి, జాతీయ అధ్యక్షురాలు ఈశ్వరి భూషణ్, గ్లోబల్ యూనివర్సిటీ అధినేత చైతన్య రాజులు సత్కరించారు.


