శ్రీకాకుళం పాతబస్టాండ్ : శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్‌లో అభివృద్ధి పనులు చేసి నెలలు గడుస్తున్నా బిల్లులు చెల్లించడంలో కమిషనర్ కూర్మారావు తీవ్ర జాప్యం చేస్తున్నారని కాంట్రాక్టర్లు మండిపడ్డారు. ఈ మేరకు జిల్లాపరిషత్ కార్యాలయం వద్ద ప్లకార్డులతో నిరసన తెలియజేశారు. అనంతరం ప్రజా ఫిర్యాదుల విభాగంలో సబ్‌కా, మున్సిపల్ కాంట్రాక్టులు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్‌కు వినతి పత్రం అందించారు. ఈ సందర్బంగా కాంట్రాక్టర్లు మాట్లాడుతూ దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న ఈఎండీలు, ఎఫ్‌ఎస్‌డీ డిపాజిట్‌లు సైతం ఇవ్వకుండా ఇబ్బందిపెట్టడం సరికాదన్నారు. అత్యవసర సమయాల్లో సైతం పనులు చేయాలని పిలుపునిస్తే వాటికి బిల్లులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం తగదన్నారు. కమిషనర్ తీరు మారకుంటే వచ్చే సోమవారం నుంచి నిరవధిక సమ్మె తప్పదన్నారు. కలెక్టర్‌ని కలిసినవారిలో బాడాన హరికృష్ణ, చల్ల సింహాచలం, జి.సుదర్శనరావు, ఆర్.కామేశ్వరరావు, పి.మహేష్, కె.మోహనరావు, ఎ.వీరభద్రరావు, ఆర్.సూర్యదీప్, తిరుమలరావు, బాలకృష్ణ, కూర్మారావు, తంగి భాస్కరరావు, వై.రామారావు తదితరులు పాల్గొన్నారు.


