పర్లాకిమిడి: రాష్ట్ర గవర్నర్ హరిబాబు కంభంపాటి సోమవారం గజపతి జిల్లా మహేంద్రగిరి మేళాలో పాల్గొంటారు. ఉదయం 11 గంటల సమయంలో మహేంద్రగిరులను సందర్శిస్తారని జిల్లా పోలీసు వర్గాలలు ఆదివారం వెల్లడించారు. అయితే గవర్నర్ పర్యటనను జిల్లా సమాచార శాఖ అధికారి గోప్యంగా ఉంచారు. అయితే మహంద్రగిరి, జిరంగో టిబెటియన్ బౌద్ధ మందిరం వద్ద హెలీప్యాడ్, సెక్యూరిటీ ఏర్పాట్లను జిల్లా ఎస్పీ ప్రహ్లాద్ సహాయ్ మీనా ఆదివారం పర్యవేక్షించారు. మహేంద్రగిరి మేళా వద్ద రాష్ట్ర రవాణా శాఖ మంత్రి బిభూతీ భూషణ్‌జెన్నా గవర్నర్‌ను ఆహ్వానిస్తారు. అక్కడ పర్యటన ముగించుకుని చంద్రగిరి టిబెటియన్ల కాలనీ, జిరంగో వద్ద బౌద్ధ మానాస్ట్రీని సాయంత్రం నాలుగు గంటల సమయంలో గవర్నర్ సందర్శిస్తారు.
కలప అక్రమ రవాణా గుట్టురట్టు
● విలువైన గుగ్గిలం కలప స్వాధీనం
● పరారీలో నిందితులు
జయపురం: కలప అక్రమ రవాణా గట్టురట్టయింది. జయపురం సబ్‌డివిజన్ బొయిపరిగుడ అటవీ విభా గ అధికారులు శనివారం రాత్రి ఆకస్మిక దాడులు చేపట్టారు. బొయిపరిగుడ సమితి గుప్తేఽశ్వర్ అటవీ రేంజ్ రామగిరి సెక్షన్‌లో విలువైన కలపను కొంతమంది తరలిస్తుండగా దాడులు చేసి పట్టుకున్నామని అటవీ రేంజ్ అధికారి ఛొబి రొంధారి చెప్పారు. కలప మాఫియా విలువైన గుగ్గిలం కలపను సైకిళ్లపై తరలిస్తుండగా బొయిపరిగుడ అటవీ విభాగ సిబ్బంది దాడులు నిర్వహించారన్నారు. అటవీ సిబ్బంది రాకను గమనించిన కలప రవాణాదారులు కలపతో ఉన్న సైకిళ్లను విడిచి పరారైనట్టు చెప్పారు. వీరి కోసం సిబ్బంది గాలిస్తున్నట్టు పేర్కొన్నారు. 12 గుగ్గిలం కలప చెక్కలు, సైకిళ్లను సీజ్ చేసినట్టు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు పేర్కొన్నారు. దాడిలో ఫారెస్టర్ రవీంద్ర హంతాల్, గార్డులు సిప్స దాస్, సోమ్యరంజన్ సుబుద్ధి, పారా ఉద్యోగులు కార్తీక్ దండసేన, రమేష్ పూజారి, పద్మనాభ జాని, భువన్ భాగదెరియ, మోహన ఒడియ, దయితేరి ప్రధాన్, రామ చంద్ర దళపతి పాల్గొన్నట్టు అధికారులు చెప్పారు.
మహేంద్ర మేళాలో
ప్రయాణ పాట్లు
● సరిపడా బస్సులు లేక భక్తుల పాట్లు
● ఉచిత సీట్ల కోసం తొక్కిసలాట
పర్లాకిమిడి: మహేంద్రగిరిపై వారం రోజులుగా జరుగుతున్న మహేంద్రగిరి మేళా కార్యక్రమం తిలకించేందుకు భక్తులు పోటెత్తుతున్నా సరైన రవాణా సౌకర్యాలు లేక ఇబ్బందులు తప్పడం లేదు. భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతు న్నా అందుకు తగ్గ బస్సులు వేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. తొలిరోజు ఒడిశా ఆర్‌టీసీ నాలుగు బస్సులు మాత్రమే వేశారు. వాస్తవానికి వాటిలో టికెట్లు ఉచితం అయినప్ప టికీ రెండో రోజు నుంచి భక్తుల నుంచి రూ.50 చొప్పున వసూలు చేస్తున్నారు. ఆదివారం భక్తుల తాకిడి ఎక్కువవ్వడంతో కొత్త బస్టాండు ఆవల కోర్టు జంక్షన్ వద్ద మహేంద్రగిరి బస్సుల్లో సీట్ల కోసం తొక్కిసలాట జరిగింది.
మహేంద్రం వద్ద ప్రమాదం..
మహేంద్రగిరి మేళాను తిలకించి వస్తున్న శ్రీకాకుళం జిల్లా మందస మండలం రట్టి గ్రామస్తులు మహేంద్రం ఘాటీ వద్ద ప్రమాదానికి గురయ్యారు. వీరు ప్రయాణిస్తున్న మినీ వ్యాన్ అదుపు తప్పి బోల్తాపడటంతో పలువురు తీవ్ర గాయాలపాలయ్యారు. ఇద్దరు మహిళల పరిస్థితి విషమంగా ఉండటంతో పర్లాకిమిడి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. కాగా, మంగళవారంతో మహేంద్రమేళా ముగింపు దశకు రావడం, ఒడిశా రాష్ట్ర గవర్నర్ సోమవారం పర్యటన సందర్భంగా భద్రత కట్టుదిట్టం చేశారు.


