జయపురం: కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఓట్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్.ఐ.ఆర్) కార్యక్రమంలో భాగంగా నేడు జయపురం మున్సిపాలిటీలో అధికారులు జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి నివాస భవనంలో కలసి ఓటరు జాబితా పరిశీలన, దిద్దుబాటుపై చర్చించారు. ఈ సందర్బంగా బాహిణీపతి మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి మూల బలం ఓటర్లని అందుచేత స్వచ్ఛమైన, కచ్చితమైన, తప్పులు లేని ఓటర్ల జాబితా తయారు చేయటం ఎంతో అవసరమన్నారు. అలాగనే ఈ ప్రక్రియలో అర్హులైన ఏ ఒక్క ఓటరు కూడా తన హక్కు కోల్పోకూడదన్నారు. కొరాపుట్ జిల్లాలో ఆదివాసీలు ఎక్కువ అని, పైగా ఈ ప్రాంతం 5 వ షెడ్యూల ప్రాంతం అని అందుచేత ఇక్కడ చాలా కుటుంబాల వద్ద తమ పూర్వీకులకు సంబంధించిన పత్రాలు, లేదా ధ్రువీకరణ పత్రాలు వెంటనే వారి అందుబాటులో ఉండకపోవచ్చని, అందుచేత ధ్రువీకరణ ప్రక్రియ సున్నితంగా, న్యాయంగా, సమ్మిళితంగా ఉండేలా చూడాలని ఆయన అధికారులను కోరారు. తద్వారా ఏ అసలైన ఓటరు పేరు కూడా ఓటరు జాబితా నుంచి మినహాయించబడదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
47 యూనిట్ల రక్తం సేకరణ
రాయగడ: స్థానిక లోటస్ ప్యారడైజ్‌లో ఆదివారం ఫ్రెండ్స్ ఎంజీఎఫ్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన రక్తదాన శిబిరానికి అనూహ్య స్పందన లభించింది. క్లబ్ సభ్యులతో పాటు స్వచ్ఛందంగా యువకులు ముందుకు వచ్చి రక్తదానం చేశారు. ఈ శిబిరంలో 47 యూనిట్ల రక్తాన్ని సేకరించిన క్లబ్ సభ్యులు దాన్ని జిల్లా కేంద్రాస్పత్రి బ్లడ్ బ్యాంక్‌కు తరలించారు. ప్రతి నెలలో క్లబ్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ సారి రక్తదాన శిబిరాన్ని నిర్వహించామని క్లబ్ అధ్యక్షుడు శ్రీహరి మోనింగి, కార్యదర్శి కింతలి శ్రీధర్, కోశాధికారి లాడి నూకరాజులు తెలియజేశారు. జిల్లా కేంద్రాస్పత్రి వైద్య సిబ్బంది ఈ శిబిరంలో తమ సహాయ సహకారాలను అందించారని చెప్పారు. రక్తదానం చేసిన వారికి క్లబ్ తరఫున మొక్కలను అందజేశారు. పర్యావరణ పరిరక్షణకు అంతా సమైక్యంగా పోరాడాలన్న నినాదంతో వారికి అవగాహన కలిగించే విధంగా మొక్కలను అందజేయడం విశేషం. కార్యక్రమంలో గంటేడ శ్రీనివాస రావు, ఇప్పిలి సన్యాసి రాజు ,న్యాయవాది సాన రమేష్ తదితరులు పాల్గొని సహకరించారు.


