పొల్యూషన్‌కు.. ఓ సొల్యూషన్‌ | - | Sakshi
Sakshi News home page

పొల్యూషన్‌కు.. ఓ సొల్యూషన్‌

Jun 8 2026 9:59 AM | Updated on Jun 8 2026 9:59 AM

పొల్యూషన్‌కు.. ఓ సొల్యూషన్‌ ●

సీఏఏక్యూఎంఎస్‌తో ఉపయోగాలెన్నో

గాలి కాలుష్యాన్ని ఆపకుంటే

భవిష్యత్‌ అంధకారమే

పర్యావరణాన్ని కాపాడుకోవాలి..

పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిదీ. ఎక్కువగా మొక్కలు నాటాలి. అనవసరంగా వాహనాలు వాడాలి. సీఏఏక్యూఎంఎస్‌ ద్వారా కాలుష్య శాతం తెలుసుకోవచ్చు. ఇది అందించే సమాచారం కేవలం సంఖ్యలు మాత్రమే కాదు.. అది మన పరిశ్రమలు, మన నదులు, మన అడవులు చివరికి మన ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన సంకేతంగా ఉంటుంది.

– కరుణశ్రీ, పర్యావరణ ఇంజనీర్‌, ఆంధ్రప్రదేశ్‌ కాలుష్య నియంత్రణ మండలి, శ్రీకాకుళం.

శ్రీకాకుళం (పీఎన్‌ కాలనీ): కాలుష్యాన్ని నియంత్రించాల్సిన బాధ్యత అందరిదీ. జిల్లా కేంద్రంలో కాలుష్యాన్ని కొలిచేందుకు కంటిన్యూస్‌ ఆంబియంట్‌ ఎయిర్‌ క్వాలిటీ మానిటరింగ్‌ స్టేషన్‌ను మున్సిపల్‌ కార్యాలయం పరిధిలో ఏర్పాటుచేశారు. గాలి కాలుష్యం శాతాన్ని యాప్‌ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. గాలి కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఓ కమిటీ సైతం ఉంది. చైర్మన్‌గా కలెక్టర్‌ ఉంటారు వీరితో పాటు ట్రాఫిక్‌, మున్సిపల్‌ అధికారులు, వ్యవసాయశాఖ అధికారులు, పీసీబీ అధికారులు, రవాణా శాఖల సమన్వయంతో ఓ కమిటీగా చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.

సీఏఏక్యూఎంఎస్‌ సెంటర్‌

సీఏఏక్యూఎంఎస్‌ అంటే..

కంటిన్యూస్‌ ఆంబియంట్‌ ఎయిర్‌క్వాలిటీ మానిటరింగ్‌ స్టేషన్‌ అంటే నిరంతర పరిసర వాయు నాణ్యత పర్యవేక్షణ కేంద్రం.

మనం పీల్చే గాలి నాణ్యతను నిరంతరం కొలిచి, ఆ సమాచారాన్ని నేరుగా ఏపీ పీసీబీ, సీపీసీబీ సర్వర్లకు తక్షణమే పంపిస్తుంది.

ఈ కేంద్రం మన చుట్టూ ఉన్న పర్యావరణ ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తుంది.

రాత్రింబవళ్లు కాలుష్య స్థాయిలను నిరంతరం కొలుస్తుంది.

కాలుష్య ధోరణులను గుర్తించి, అది ఎక్కడి నుంచి వస్తుందో విశ్లేషిస్తుంది.

ప్రజలకు తక్షణ వాయు నాణ్యత సూచిక (ఏక్యూఐ) సమాచారాన్ని అందిస్తుంది.

కాలుష్య నియంత్రణ, ప్రజారోగ్య పరిరక్షణకు సంబంధించిన ప్రభుత్వ నిర్ణయాలకు సహకరిస్తుంది.

కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) నిర్దేశించిన జాతీయ వాయు నాణ్యత ప్రమాణాలను పరిశ్రమలు, ఇతర కాలుష్య వనరులు పాటిస్తున్నాయో లేదో పరిశీలిస్తుంది.

ముఖ్య భాగాలు..

అనలైజర్‌ గది: ప్రతి కాలుష్యకాన్ని కొలిచే అత్యాధునిక పరికరాలు ఇందులో ఉంటాయి. కచ్చితత్వం కోసం వాటిని క్రమం తప్పకుండా కేలిబ్రేట్‌ చేస్తారు.

వాయు నమూనా సేకరణ వ్యవస్థ : పరిసర గాలిని నిరంతరం లోపలికి తీసుకుని విశ్లేషక పరికరాల ద్వారా పంపుతుంది. నమూనా ఎల్లప్పుడూ తాజాగా ఉంటుంది.

వాతావరణ సెన్సార్‌ వ్యవస్థ : గాలి, ఉష్ణోగ్రత, తదితర సెన్సార్లు అమర్చిన ఎత్తయిన స్తంభం. అన్ని కేంద్రాల మధ్య సరితూగే విధంగా ప్రామాణిత ఎత్తులో ఏర్పాటు చేస్తారు.

డేటా అక్విజిషన్‌ సిస్టమ్‌ : ప్రతి నిమిషం అన్ని రీడింగులను సేకరించి స్వయం చాలకంగా నమోదు చేస్తుంది. మానవ జోక్యం అవసరం లేదు.

ఏపీ పీసీబీ, సీపీసీబీ ఆన్‌లైన్‌ అనుసంధానం : సేకరించిన సమాచారం తక్షణమే రాష్ట్ర, కేంద్ర సర్వర్లకు పంపుతారు. ఈ సమాచారాన్ని సీపీసీబీ వెబ్‌సైట్‌, గాలి నాణ్యత యాప్‌లలో ఎవరైనా చూడవచ్చు.

పాయింట్లు ఎలా నిర్ధారించాలి..

వాయు నాణ్యత సూచిక 50 పాయింట్స్‌ వస్తే అది స్వచ్ఛమైన గాలి నాణ్యతకు సూచిక.

400 పాయింట్స్‌ వస్తే అది తీవ్రమైన హెచ్చరిక.

0 – 50 మంచి గాలి, 51 నుంచి 100 సంతృప్తికరమైంది. 101 నుంచి 200 మోస్తరు ఆస్తమా, గుండె లేదా ఊపిరితిత్తుల వ్యాధిగ్రస్తులకు, పిల్లలు, వృద్ధులకు ఇబ్బందిగా ఉంటుంది.

201 – 300 అధ్వానం. ఎక్కువసేపు బహిరంగ ప్రదేశాల్లో ఉంటే శ్వాసలో ఇబ్బందులు తప్పవు.

301 – 400 అత్యంత అధ్వానంగా ఉంటుంది. ఎక్కువకాలం ప్రభావితమైతే శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది.

401 – 500 తీవ్రం ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతూ ఆరోగ్యవంతులకు సైతం ప్రమాదకరం.

మనకు ఈ కేంద్రం ఎందుకు..?

పరిశ్రమల సముదాయాలు, గనుల కార్యకలాపాలు జిల్లాలో ఉన్నాయి.

తుఫాన్ల ప్రభావానికి లోనయ్యే విస్తారమైన తీరప్రాంతం ఉంది.

పరిశ్రమల సమీపంలో నివసించే అధిక గ్రామీణ జనాభా ఉంటుంది.

సీఏఏక్యూఎంఎస్‌ వీటన్నింటినీ నిరంతరం పర్యవేక్షిస్తుంది.

సంవత్సరానికొకసారి గాలి నాణ్యత మెరుగుపడుతోందా లేదా క్షీణిస్తోందా అనే చారిత్రక రికార్డును రూపొందిస్తుంది.

అధిక కాలుష్యం నమోదైనప్పుడు పాఠశాలలు, ఆస్పత్రులకు హెచ్చరికలు జారీ చేస్తుంది.

అదనంగా ఎలా ఉపయోగపడుతుంది?

గాలి వేగం, గాలి దిశ, కాలుష్యం ఏ దిశలో ప్రయాణిస్తుందో తెలుసుకోవడానికి.

ఉష్ణోగ్రత, సాపేక్ష ఆర్థ్రత, వేడి, తేమ గల గాలి కాలుష్యాన్ని తెలుసుకుంటుంది.

వాతావరణ పీడనం, తక్కువ పీడనం కాలుష్యాన్ని భూమి ఉపరితలానికి దగ్గరగా తీసుకువస్తుంది.

వర్షపాతం–వర్షం గాలిలోని కాలుష్యకారకాలను కడిగి, తాత్కాలికంగా గాలి నాణ్యతను మెరుగుపరుస్తుంది.

సౌర వికిరణం–భూమి సమీపంలోని ఓజోన్‌ ఏర్పడే రసాయనిక చర్యలను ప్రేరేపిస్తుంది.

Advertisement
 
Advertisement
Advertisement