వాగునూ వదల్లేదు! | - | Sakshi
Sakshi News home page

వాగునూ వదల్లేదు!

Jun 8 2026 9:59 AM | Updated on Jun 8 2026 9:59 AM

రణస్థలం: మండల కేంద్రంలోని జె.ఆర్‌.పురం పంచాయతీలో వెంకటేశ్వర కాలనీలో ప్రభుత్వ నీటివాగును గుర్తు తెలియని వ్యక్తులు మట్టితో కప్పివేశారు. దీంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. నీటివాగు మట్టితో కప్పేయడం వల్ల ఎగువ నుంచి వచ్చిన వర్షపు నీరు నిలిచిపోయి ఇళ్లల్లోకి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ఆక్రమణ తొలగించి నీటి వాగును పరిరక్షించాలని కోరుతున్నారు. అనంతరం రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు.

విద్యుత్‌ సమస్యకు పరిష్కారం

కంచిలి: జాడుపూడిలో లో ఓల్టేజీ విద్యుత్‌ సరఫరాతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు అధికారులకు పలుమార్లు విన్నవించినా ప్రయోజనం లేకపోయింది. ఈ దశలో ఇచ్ఛాపురం నియోజకవర్గ వైఎస్సార్‌ సీపీ సమన్వయకర్త సాడి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి దృష్టికి రావడంతో విద్యుత్‌ శాఖ సీఎండీ కార్యాలయానికి ఆదివారం మధ్యాహ్నం సమాచారం అందించారు. వారు వెంటనే స్పందించి సాయంత్రం 6 గంటలకు గ్రామానికి కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌ పంపించారు.

కల్తీ ఆహారం విక్రయిస్తే చర్యలు

పలాస: కల్తీ ఆహారం విక్రయిస్తే చర్యలు తప్పవని జిల్లా ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ జి.శ్రీరాములు హెచ్చరించారు. ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవా సంఘం, సివిల్‌ జడ్జి పలాస డివిజన్‌ ఆదేశాల మేరకు జిల్లా ఆహార భద్రతా సంస్థ ఆధ్వర్యంలో పలాస కాష్యూ అసోసియేషన్‌ హాలులో సదస్సు నిర్వహించారు. అంతకు ముందు పలు దుకాణాలను తనిఖీ చేశారు. నిల్వ ఉన్న ఆహారాన్ని విక్రయించరాదని చెప్పారు. కార్యక్రమంలో పి.సి.ఎం.ఎ.అధ్యక్షుడు మల్లా శ్రీనివాసరావు, ప్యానల్‌ న్యాయవాది కె.లోకేశ్వరరావు, హోటళ్ల యజమానులు, పలువురు వ్యాపారులు పాల్గొన్నారు.

నీరజకు సాహితీబంధు పురస్కారం

శ్రీకాకుళం కల్చరల్‌ : రాజమండ్రిలో శ్రీశ్రీ కళావేదిక, చైతన్య సారస్వత పరిషత్‌ ఆధ్వర్యంలో జరిగిన 7వ ప్రపంచ తెలుగు సాహిత్య మహాసభలలో శ్రీకాకుళం నగరానికి చెందిన శ్రీ అభినయ నృత్యానికేతన్‌ నాట్యాచారిణి డాక్టర్‌ తిమ్మరాజు నీరజ సుబ్రహ్మణ్యంకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేశ్‌ ‘సాహితీ బంధు’ పురస్కారాన్ని ప్రదానం చేశారు. కార్యక్రమంలో శ్రీశ్రీ కళావేదిక చైర్మన్‌ కత్తి మండ ప్రతాప్‌, జాతీయ అధ్యక్షులు ఈశ్వరి భూషణం, జాతీయ ప్రణాళికా అధికారి పార్థసారథి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ శ్రీ కళావేదిక శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు మణిపాత్రుని నాగేశ్వరరావు, జిల్లా కన్వీనర్‌ బి.ఉమామహేశ్వరరావు, జిల్లా సభ్యులు ఆదివారం అభినందనలు తెలియజేశారు.

యథేచ్ఛగా మట్టి అక్రమ తవ్వకాలు

గార : చెరువుల్లో మట్టి అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. పది అడుగుల మేర తవ్వకాలు చేపట్టడంతో భారీ గుంతలు ఏర్పడుతున్నాయి. వర్షం నీరు చేరిన తర్వాత ప్రమాదాలు జరుగుతాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. గత కొన్ని రోజులుగా మెండపేట సమీపంలోని మెండవానిచెరువులో టిప్పర్ల ద్వారా మట్టిని శ్రీకాకుళం పట్టణానికి అక్రమంగా తరలిస్తున్నారు. ఎవరైనా అడిగితే అధికార పార్టీ నాయకుడి అనుమతితో చేస్తున్నామని చెబుతున్నారని స్థానికులంటున్నారు. చెరువులను పరిరక్షించాల్సిన పంచాయతీ అధికారులు, గ్రామ రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికై నా అక్రమ మట్టి తవ్వకాలను అరికట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement